కళ్లు చెదిరే యార్కర్‌.. అభినందించకుండా ఉండలేకపోయిన బ్యాటర్‌  | IPL 2024: Andre Russell Claps For Ishant Sharma After Being Bowled By Toe Crushing Yorker | Sakshi
Sakshi News home page

కళ్లు చెదిరే యార్కర్‌.. అభినందించకుండా ఉండలేకపోయిన బ్యాటర్‌ 

Apr 3 2024 10:44 PM | Updated on Apr 4 2024 9:20 AM

IPL 2024: Andre Russell Claps For Ishant Sharma After Being Bowled By Toe Crushing Yorker - Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌ వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ కళ్లు చెదిరే యార్కర్‌ను సంధించాడు. కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాంత్‌ సూపర్‌ డెలివరీని బౌల్‌ చేశాడు. ఇషాంత్‌ యార్కర్‌ దెబ్బకు బ్యాటర్‌ ఆండ్రీ రసెల్‌ ఫ్యూజులు ఎగిరిపోయాయి. సెకెన్ల వ్యవధిలో బంతి వికెట్లను గిరాటు వేయడంతో రసెల్‌ నిర్ఘాంతపోయాడు.   

ఇషాంత్‌ యార్కర్‌కు సమాధానం చెప్పలేని రసెల్‌ బంతిని అడ్డుకునే క్రమంలో బొక్కబోర్లా పడ్డాడు. ఈ బంతిని సంధించినందుకుగాను రసెల్‌ ఇషాంత్‌ను అభినందించకుండా ఉండలేకపోయాడు. కిందపడి లేవగానే చప్పట్లతో అభినందించాడు. ఇషాంత్‌ సూపర్‌ యార్కర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. 

ఇషాంత్‌ రసెల్‌ను ఔట్‌ చేసిన సందర్భం కూడా చాలా కీలకమైంది. ఆఖరి ఓవర్‌ తొలి బంతికి.. అప్పటికే రసెల్‌  (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోయి ఉన్నాడు. ఆ సమయంలో ఇషాంత్‌ అద్భుతమైన యార్కర్‌తో రసెల్‌ను బోల్తా కొట్టించాడు. ఆ బంతికి రసెల్‌ ఔట్‌ కాకపోయి ఉండివుంటే, కేకేఆర్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్‌ నమోదు చేసి ఉండేది. లేటు వయసులో ఇషాంత్‌ ప్రదర్శన​కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ మ్యాచ్‌లో అతను ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ రెండు వికెట్లు పడగొట్టాడు.  

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. సునీల్‌ నరైన్‌ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్‌ (8 బంతుల్లో 26; ఫోర్‌, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్‌.

ఇదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్‌ చేసిన స్కోర్‌ (277/3) ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. ఓ సీజన్‌లో 250పైగా స్కోర్లు రెండు సార్లు నమోదు కావడం 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement