IPL 2023: Sunrisers Hyderabad Head Coach Brian Lara Says Very Impressed With T Natarajan - Sakshi
Sakshi News home page

SRH- Brian Lara: ‘పవర్‌ ప్లే’లోనే ఓడిపోయాం! టాస్‌ విషయంలో మా నిర్ణయం సరైందే!

Published Tue, Apr 4 2023 8:49 AM

IPL 2023 SRH Brian Lara: We Lost In 1st Powerplay Impressed With Natarajan - Sakshi

IPL 2023 SRH Vs RR- సాక్షి, హైదరాబాద్‌: రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ ఓటమికి రెండు ‘పవర్‌ ప్లే’లలో ప్రదర్శనే కారణమని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచ్‌ బ్రియాన్‌ లారా అభిప్రాయపడ్డాడు. ‘ముందుగా రాజస్తాన్‌ పవర్‌ప్లేను అద్భుతంగా వాడుకొని 85 పరుగులు చేసింది. అదే మా వంతు వచ్చేసరికి పవర్‌ప్లేలో పరుగులే చేయలేకపోయాం.

200కుపైగా స్కోరు ఛేదిస్తూ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోతే కోలుకోవడం కష్టమే’ అని లారా అన్నాడు. అయితే, తమ జట్టు స్టార్‌ పేసర్‌ నటరాజన్‌ ప్రదర్శన పట్ల లారా సంతృప్తి వ్యక్తం చేశాడు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన నటరాజన్‌.. తన రెండో ఓవర్‌ నుంచి పుంజుకున్న తీరు అమోఘమని కొనియాడాడు. తొలుత పరుగులిచ్చినా ఆ తర్వాత పొదుపుగా బౌలింగ్‌ చేసి వికెట్లు తీసిన తీరును ప్రశంసించాడు.

ఇలాంటి సానుకూల అంశాలు కూడా
ఆఖరి ఎనిమిది ఓవర్లలో తమ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారని.. ఒకానొక సమయంలో రాజస్తాన్‌ రాయల్స్‌ 225 పరుగుల స్కోరు చేస్తుందని భావిస్తే.. 200 రాబట్టడానికి కూడా ఇబ్బంది పడేలా చేశారని లారా పేర్కొన్నాడు. అనేక ప్రతికూలతల నడుమ ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న తాత్కాలిక కెప్టెన్‌ భువనేశ్వర్‌కుమార్‌ నిర్ణయాన్ని లారా సమర్థించాడు. ‘‘ఉప్పల్‌ పిచ్‌పై మేము ప్రాక్టీసు చేశాం. వికెట్‌ కాస్త బౌన్సీగా ఉన్నట్లు అనిపించింది. పేస్‌కు అనుకూలిస్తుందని భావించాం. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఒక్క మ్యాచ్‌లో ఓటమితో కుంగిపోము. మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతాం’’ అని లారా పేర్కొన్నాడు.

చదవండి: IPL 2023: ఇదొక్కటి! బ్యాటర్‌కు దిమ్మతిరిగింది.. అంతేనా ఆఖర్లో రెండు సిక్సర్లు!

Advertisement
Advertisement