IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక..

IPL 2023 SRH Vs RR Fans Slams Bhuvneshwar Forget Move On Not Bowl Well - Sakshi

IPL 2023- SRH Vs RR: సొంతగడ్డపై నాలుగేళ్ల తర్వాత.. అభిమానుల కేరింతల నడుమ ఉప్పల్‌ వేదికగా ఐపీఎల్‌-2023లో తొలి మ్యాచ్‌ ఆడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో చిత్తుగా ఓడి పరాజయంతో ఈ సీజన్‌ను ఆరంభించింది. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ గైర్హాజరీ నేపథ్యంలో రైజర్స్‌ పగ్గాలు చేపట్టిన టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సారథిగా పూర్తిగా విఫలమయ్యాడు.

తప్పు చేశాడు!
టాస్‌ గెలిచిన భువీ.. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలుత బౌలింగ్‌ ఎంచుకుని పెద్ద పొరపాటే చేశాడు. పవర్‌ప్లేలోనే సన్‌రైజర్స్‌కు ఈ విషయం అర్ధమైపోయింది. రాజస్తాన్‌ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌(37 బంతుల్లో 54 పరుగులు), జోస్‌ బట్లర్‌ (22 బంతుల్లో 54 పరుగులు) ఆకాశమే హద్దుగా చెలరేగారు.

వీరికి తోడు కెప్టెన్‌ సంజూ శాంసన్‌ సైతం అర్ధ శతకం(32 బంతుల్లో 55 పరుగులు) అద్భుతంగా రాణించాడు. ఆఖర్లో హెట్‌మెయిర్‌ తనదైన శైలిలో (16 బంతుల్లో 22 పరుగులు) ఫినిష్‌ చేశాడు.

దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు స్కోరు చేసింది రాజస్తాన్‌. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

రాజస్తాన్‌ పరుగుల వరద.. పెవిలియన్‌కు క్యూ కట్టిన రైజర్స్‌ బ్యాటర్లు
రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటర్లు పరుగుల వరద పారించిన చోట.. హైదరాబాద్‌ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యాడు. టాపార్డర్‌లో ఒక్కరంటే ఒక్కరు కనీసం ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేకపోయారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ఎంత పేలవంగా సాగిందో! ఫలితంగా 72 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

కెప్టెన్‌గా పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా?
ఇక మ్యాచ్‌ అనంతరం ఓటమిపై స్పందించిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ‘‘బ్యాటింగ్‌ పిచ్‌పై బౌలింగ్‌ ఎంచుకున్నావు. టాస్‌ సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకన్నావు. పోనీ కెప్టెన్సీపై దృష్టి పెట్టావా అంటే అదీ లేదు. 

ముగ్గురు పేసర్లు ఉన్నారు.. వారి సేవలు వినియోగించుకోవాల్సింది పోయి.. నువ్వూ బౌలింగ్‌ చేశావు. 3 ఓవర్లలోనే 36 పరుగులు సమర్పించుకున్నావు. ఒత్తిడిని అధిగమించలేకపోయావు. కెప్టెన్‌గా నువ్వు పనికిరావు. పైగా ఓటమికి చచ్చు కారణాలు చెబుతావా అంటూ ఫైర్‌ అవుతున్నారు.

ఇంతకీ భువీ ఏమన్నాడంటే..
‘‘ఈ పరాజయం గురించి మర్చిపోయి.. ముందుకు సాగాలి. ఆఖరి ఆరు ఓవర్లలో మా బౌలర్లు ముఖ్యంగా ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుతంగా బౌల్‌ చేశాడు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది.

మేము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్‌ చేయాల్సింది. ఏదేమైనా ఇదే మొదటి మ్యాచ్‌. కాబట్టి తప్పులు సరిదిద్దుకుంటే అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చు. సౌతాఫ్రికన్లు జట్టుతో చేరాల్సి ఉంది. వాళ్లు జట్టుతో చేరితో బ్యాటింగ్‌ ఆర్డర్‌ మరింత పటిష్టమవుతుంది. పిచ్‌ బాగుంది.

మేమేమీ బాధపడటం లేదు
నిజానికి ఇక్కడ మాకు అనుకూలంగా తయారు చేయించుకోవచ్చు. కానీ.. ఆ విషయంలో మేమేమీ బాధపడటం లేదు. రాజస్తాన్‌ ఓపెనర్లు బట్లర్‌, జైశ్వాల్‌ అద్భుతంగా రాణించారు. ట్రెంట్‌ బౌల్ట్‌ పవర్‌ప్లేలో వికెట్లు తీసి మమ్మల్ని దెబ్బకొట్టాడు.

ఇక యుజీ చహల్‌, రవి అశ్విన్‌ తమదైన శైలిలో చెలరేగారు. జేసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మెరిశాడు’’ అని భువీ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో పిచ్‌ గురించి మాట్లాడుతూ.. భువనేశ్వర్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలే అతడిపై ఫ్యాన్స్‌ ఆగ్రహానికి కారణమయ్యాయి. కాగా సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ సహా ఇతర సౌతాఫ్రికా ఆటగాళ్లు నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌ ముగించుకుని జట్టుతో చేరే అవకాశం ఉంది.

చదవండి: IPL 2023- Virat Kohli: చెలరేగిన హైదరాబాదీ.. అయినా! కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌.. అరుదైన ఘనత! ఒకే ఒక్కడితో..
Aiden Markram: అక్కడ కెప్టెన్‌ ఇరగదీశాడు.. ఇక్కడ ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top