IPL 2022: 'రిటైర్డ్‌ ఔట్‌'.. ఇది ఆరంభం మాత్రమే : అ‍శ్విన్‌

IPL 2022: Ravichandran Ashwin Explains His Decision Retire-out VS LSG - Sakshi

టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐపీఎల్‌ 2022లో రిటైర్డ్‌ ఔట్‌ అయిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అశ్విన్‌ కొత్త సంప్రదాయానికి తెరదీశాడు. తాజాగా రిటైర్డ్‌ ఔట్‌పై అశ్విన్‌ స్పందించాడు. 

''రిటైర్డ్‌ ఔట్‌ అనేది పాత పద్దతే.. ఐపీఎల్‌లో మాత్రం కొత్తది. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వాటిని తీసుకురావాలి.. అందుకు ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఆ పనిని నాతోనే ప్రారంభించాను. ఇది ఆరంభం మాత్రమే.. ఇలాంటి రిటైర్డ్‌ ఔట్‌లు ఐపీఎల్‌లో ఇకపై చాలానే చూడనున్నారు. రిటైర్డ్‌ ఔట్‌ అయిన తొలి బ్యాటర్‌గా నేను చరిత్ర లిఖించి ఉండొచ్చే.. కానీ క్రికెట్‌ అంటేనే ప్రయోగాలకు వేదిక.. అలాంటి గేమ్‌లో ఒక ఆటగాడు ఒక దానిపై నిల్చోవద్దు. రకరకాల ప్రయోగాలు చేస్తూ రావాలి. 

ఒకప్పుడు ఐపీఎల్‌లో నేను మన్కడింగ్‌ చేసినప్పుడు అందరూ తప్పు బట్టారు.. విమర్శించారు. కానీ అదే మన్కడింగ్‌ను ఇవాళ చట్టబద్ధం చేశారు. మార్పు అనేది మంచికే.. అవసరానికి మాత్రమే వాడితే బాగుంటుంది. ఒక రకంగా టి20 క్రికెట్‌ను ఫుట్‌బాల్‌తో పరిగణించవచ్చు. అది 90 నిమిషాల ఆట అయితే.. టి20 క్రికెట్‌ మూడు గంటల ఫార్మాట్‌. ఫుట్‌బాల్‌లో ఒక ఆటగాడు గాయపడినప్పుడు అతనికి సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే ఆటగాడు గోల్‌ చేస్తే అది నైతికం.

కానీ క్రికెట్‌లో ఇంకా ఆ రూల్‌ లేదు. ఆటగాడు గాయపడితే అతని స్థానంలో వచ్చే ఆటగాడు కేవలం సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ తప్ప.. బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా క్రీజులోకి రాలేడు. అందుకే రిటైర్డ్‌ ఔట్‌ అనేది మంచి పద్దతే. ఒక రకంగా మన తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్‌ బాగా ఆడతాడనుకుంటే అతనికి అవకాశం ఇవ్వడం కోసం మనం ఔటైనా తప్పు లేదు. అందుకోసం కావాలని ఔట్‌ అయితే మాత్రం తప్పు.. రిటైర్డ్‌ ఔట్‌గా వెళితే ఎవరు అభ్యంతరం చెప్పరు. నేను దాన్నే ఫాలో అయ్యాను. చరిత్రను ఎవరో ఒకరు తిరగరాయాలంటారు.. నాకు తెలిసి నేను చేసింది అదేనేమో.. ఇకపై ఐపీఎల్‌లో మరిన్ని రిటైర్డ్‌ ఔట్‌లు చూడొచ్చు'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక లక్నోతో మ్యాచ్‌లో అశ్విన్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 23 బంతుల్లో 28 పరుగులు వద్ద ఉన్నప్పుడు అసౌకర్యంగా ఫీలైన అశ్విన్‌ రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేరాడు. రిటైర్డ్‌ ఔట్‌ అంటే.. అంపైర్‌ అనుమతి లేకుండానే గ్రౌండ్‌ వీడడం.. ఒక రకంగా సదరు బ్యాట్స్‌మన్‌కు మళ్లీ బ్యాటింగ్‌ చేసే చాన్స్‌ ఉండదు.

చదవండి: ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఫీట్‌

IPL 2022: కోహ్లి ఔట్‌ వెనుక ధోని మాస్టర్‌ ప్లాన్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top