ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఫీట్‌

Bowler Take 6 Wickets-6 Balls Rare Feet Cricket History Nepal Pro T20 Cup - Sakshi

క్రికెట్‌లో హ్యాట్రిక్‌ తీయడం గొప్ప.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు అరుదైన ఫీట్‌.. మరి ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీస్తే అద్భుతం అనాల్సిందే. అందుకే అద్భుతాలు అరుదుగా జరుగుతాయంటారు.. మరి ఆ అద్బుతాన్ని సాధించింది ఎవరంటే మలేషియా క్లబ్‌ ఎలెవెన్‌కు చెందిన వీరన్‌దీప్‌ సింగ్‌ అనే బౌలర్‌. నిజానికి వీరన్‌దీప్‌ సింగ్‌ తీసింది ఐదు బంతుల్లో ఐదు వికెట్లు.. ఇక ఆరో వికెట్‌ రనౌట్‌ రూపంలో వచ్చింది. వీరన్‌దీప్‌ సింగ్‌ ఐదు వికెట్ల క్లబ్‌లో జాయిన్‌ అయినప్పటికి ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించడమనేది గొప్ప విషయం.

నేపాల్‌ ప్రొ కప్‌ టి20 చాంపియన్‌షిప్‌లో భాగంగా మలేషియా క్లబ్‌ ఎలెవెన్‌ వర్సెస్‌ పుష్‌ స్పోర్ట్స్‌ ఢిల్లీ మధ్య జరిగింది. వీరన్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌కు రాకముందు పుష్‌ స్పోర్ట్స్‌ ఢిల్లీ స్కోరు 131-3.. అతని ఓవర్‌ పూర్తయ్యేసరికి 132-9గా మారిపోయింది. ఓవర్‌ తొలి బంతిని వైడ్‌ వేశాడు. ఆ తర్వాత రెండో బంతికి రనౌట్‌.. ఆ తర్వాత మిగిలిన ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులోనే వీరన్‌దీప్‌ సింగ్‌ హ్యట్రిక్‌ నమోదు చేయడం విశేషం. హ్యాట్రిక్‌ సాధించిన తర్వాత వీరన్‌ షాహిద్‌ అఫ్రిది సెలబ్రేషన్‌ను గుర్తు చేశాడు.

మొత్తానికి వీరన్‌దీప్‌ సింగ్‌ రెండు ఓవర్లు వేసి 8 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి బెస్ట్‌ ప్రదర్శన నమోదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన అలెడ్‌ క్యారీ క్లబ్‌ క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీశాడు. ఇందులో మొదటి వికెట్‌ స్లిప్‌ క్యాచ్‌, తర్వాతి రెండు వికెట్లు క్యాచ్‌, ఎల్బీ రూపంలో.. ఇక చివరి మూడు వికెట్లు క్లీన్‌బౌల్డ్‌ రూపంలో సాధించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top