IPL 2022: ముంబై ఇండియన్స్‌ చెత్త రికార్డు.. 15 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి..!

IPL 2022: Most Embarrassing Record For Mumbai Indians In Entire IPL History - Sakshi

15 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్‌ తొలిసారి ఓ ఘోర అనుభవాన్ని ఎదుర్కొంది. నిన్న సన్‌రైజర్స్‌ చేతిలో పరాజయంతో ఐపీఎల్‌ 2022 సీజన్‌‌‌లో 10వ ఓటమిని మూటగట్టుకున్న రోహిత్‌ సేన.. ఐపీఎల్‌ హిస్టరీలో తొలిసారి పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో ముగించనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు (6 పాయింట్లు) నమోదు చేసిన ఫైవ్‌ టైమ్‌ ఛాంపియన్‌ ముంబై జట్టు.. మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉన్నప్పటికీ ఈ పరాభవాన్ని తిప్పంచుకునే ఆస్కారం లేదు. 

ముంబై తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీపై గెలిచినా పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్న చెన్నై (13 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు).. ముంబై (ఒకవేళ ఢిల్లీపై గెలిస్తే) కంటే మెరుగైన రన్‌రేట్‌ కలిగి ఉంది కాబట్టి చివరి స్థానంలో మార్పు ఉండకపోవచ్చు. దీంతో ముంబై ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చివరి స్థానంలో నిలువడం దాదాపుగా ఖరారైంది. ఐపీఎల్‌ చర్రితలో ముంబై ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొనడం ఇదే తొలిసారి. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మినహా అన్ని జట్లు ఏదో ఒక సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచాయి. 

ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌ 3 పరుగుల తేడాతో చిత్తైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. రాహుల్ త్రిపాఠి(44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై చివరి నిమిషం వరకు పోరాడినప్పటికీ లక్ష్యానికి 3 పరుగుల దూరంలో (190/7) నిలిచిపోయింది. ఈ సీజన్‌లో ముంబై పోరాటపటిమ కనబర్చిన ఏకైక మ్యాచ్‌ ఇదే కావడం విశేషం.
చదవండి: IPL 2022: తిలక్‌ గురించి రోహిత్‌ చెప్పింది కరెక్ట్‌.. అయితే..

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top