కోల్‌కథ...ఇంకా ఉంది!

IPL 2022: Knight Riders beat Mumbai by 52 runs - Sakshi

52 పరుగులతో ముంబైపై నైట్‌రైడర్స్‌ ఘన విజయం

కుప్పకూలిన రోహిత్‌ బృందం

బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన వృథా

ముంబై: తొలి పది మ్యాచ్‌లలో తీసింది 5 వికెట్లే... ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఈసారి తన సత్తా చూపించాడు. 9 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ముంబైకి మంచి విజయావకాశం సృష్టించాడు. కానీ రోహిత్‌ శర్మ బృందం ఆ అవకాశాన్ని వృథా చేసుకుంది. మరోవైపు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించే స్థితిలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) కీలక విజయంతో ఆశలు నిలబెట్టుకుంది.

సోమవారం జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ 52 పరుగుల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్‌ రాణా (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్లుగా నిలిచింది. ఐపీఎల్‌లో బుమ్రా తన అత్యుత్తమ ప్రదర్శన (5/10) నమోదు చేశాడు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్‌ కిషన్‌ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించాడు.  

రాణించిన వెంకటేశ్, రాణా...
కోల్‌కతాకు ఈసారి సరైన ఆరంభం లభించింది. వెంకటేశ్, అజింక్య రహానే (24 బంతుల్లో 25; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 34 బంతుల్లోనే 60 పరుగులు జోడించారు. మూడో స్థానంలో వచ్చిన రాణా కూడా ధాటిని ప్రదర్శించడంతో 11 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు సరిగ్గా 100 పరుగులకు చేరింది. రాణా, రసెల్‌ జోరు మీదుండటంతో ఇక మిగిలిన ఓవర్లలో విధ్వంసం ఖాయమనిపించింది. అయితే బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో ఆటను ఒక్కసారిగా మలుపు తిప్పాడు.

ఒకే ఓవర్లో రాణా, రసెల్‌ (9)లను అవుట్‌ చేసిన బుమ్రా, తన తర్వాతి ఓవర్లో మరో 3 వికెట్లతో చెలరేగాడు. కోల్‌కతా వరుస వికెట్లు కోల్పోయిన తర్వాత చివర్లో రింకూ సింగ్‌ (19 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొంత పోరాడగలిగాడు. అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై తడబడింది. ఇషాన్‌ మినహా అంతా విఫలమయ్యారు. రోహిత్‌ శర్మ (2), తిలక్‌ వర్మ (6) ఆరంభంలోనే వెనుదిరగ్గా, టిమ్‌ డేవిడ్‌ (13), పొలార్డ్‌ (15) ప్రభావం చూపలేకపోయారు.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: వెంకటేశ్‌ (సి) స్యామ్స్‌ (బి) కార్తికేయ 43; రహానే (బి) కార్తికేయ 25; రాణా (సి) కిషన్‌ (బి) బుమ్రా 43; శ్రేయస్‌ (సి) కిషన్‌ (బి) మురుగన్‌ 6; రసెల్‌ (సి) పొలార్డ్‌ (బి) బుమ్రా 9; రింకూ (నాటౌట్‌) 23; జాక్సన్‌ (సి) స్యామ్స్‌ (బి) బుమ్రా 5; కమిన్స్‌ (సి) తిలక్‌ (బి) బుమ్రా 0; నరైన్‌ (సి అండ్‌ బి) బుమ్రా 0; సౌతీ (సి) పొలార్డ్‌ (బి) స్యామ్స్‌ 0; వరుణ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165.
వికెట్ల పతనం: 1–60, 2–87, 3–123, 4–136, 5–139, 6–156, 7–156, 8–156, 9–164.
బౌలింగ్‌: స్యామ్స్‌ 4–0–26–1, మురుగన్‌ 4–0–35–1, బుమ్రా 4–1–10–5, మెరిడిత్‌ 3–0–35–0, కార్తికేయ 3–0–32–2, పొలార్డ్‌ 2–0–26–0.  

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) జాక్సన్‌ (బి) సౌతీ 2; ఇషాన్‌ (సి) రింకూ (బి) కమిన్స్‌ 51; తిలక్‌ (సి) రాణా (బి) రసెల్‌ 6; రమణ్‌దీప్‌ (సి) రాణా (బి) రసెల్‌ 12; డేవిడ్‌ (సి) రహానే (బి) వరుణ్‌ 13; పొలార్డ్‌ (రనౌట్‌) 15; స్యామ్స్‌ (సి) జాక్సన్‌ (బి) కమిన్స్‌ 1; మురుగన్‌ (సి) వరుణ్‌ (బి) కమిన్స్‌ 0; కార్తికేయ (రనౌట్‌) 3; బుమ్రా (రనౌట్‌) 0; మెరిడిత్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (17.3 ఓవర్లలో ఆలౌట్‌) 113.
వికెట్ల పతనం: 1–2, 2–32, 3–69, 4–83, 5–100, 6–102, 7–102, 8–112, 9–113, 10–113.
బౌలింగ్‌: సౌతీ 3–0–10–1, కమిన్స్‌ 4–0–22–3, రసెల్‌ 2.3–0–22–2, నరైన్‌ 4–0–21–0, వరుణ్‌ 3–0–22–1, వెంకటేశ్‌ 1–0–8–0.

ఐపీఎల్‌లో నేడు
గుజరాత్‌ టైటాన్స్‌ X లక్నో సూపర్‌ జెయింట్స్‌
వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top