IPL 2022: Delhi Capitals Bus Attacked in Mumbai, Deets Inside - Sakshi
Sakshi News home page

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై దాడి

Mar 16 2022 5:05 PM | Updated on Mar 23 2022 6:20 PM

IPL 2022: Delhi Capitals Bus Attacked In Mumbai - Sakshi

Delhi Capitals Bus Attacked: ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు ముంబైలో జరిగిన ఓ ఘటనతో రిషబ్‌ పంత్‌ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపటల్స్‌ జట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోవిడ్‌ నేపథ్యంలో ఈ సీజన్‌ లీగ్‌ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని నాలుగు వేదికల్లో (ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్, బ్రబోర్న్‌లతో పాటు పుణేలోని ఎంసీఏ స్టేడియాలు) నిర్వహించనుండగా, ఇందుకోసం అన్ని జట్లతో పాటు ఢిల్లీ కూడా ఇప్పటికే ముంబై చేరుకుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నగరంలోని తాజ్ హోటల్ వద్ద పార్క్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై ఓ ప్రాంతీయ పార్టీకి చెందిన  కొందరు కార్యకర్తలు దాడి చేశారు. అయితే దాడి జరిగిన సమయంలో బస్సులో ఆటగాళ్లెవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 


దాడికి పాల్పడిన దుండగులు బస్సుపై పోస్టర్లు అతికించడంతో పాటు మరాఠీలో  నినాదాలు చేస్తూ కర్రలు, రాడ్లతో అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేసినట్టు సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఐపీఎల్‌ కోసం స్థానిక వాహనాలను కాకుండా పక్క రాష్ట్రాల బస్సులను వినియోగిస్తున్నారన్న అక్కసుతో ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 143, 147, 149, 427 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు. కాగా, ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఈనెల (మార్చి) 26 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. 27న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టాల్సి ఉంది. ఇందుకోసం డీసీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్, అసిస్టెంట్ కోచ్ జేమ్స్ హోప్స్, కెప్టెన్‌ రిషబ్‌ పంత్ సహా పలువురు ఆటగాళ్లు ఇప్పటికే ముంబైకి చేరుకుని సన్నాహకాలు  ప్రారంభించారు. 


చదవండి: ఐపీఎల్‌లో అవమానం.. విదేశీ లీగ్‌లో ఆడనున్న టీమిండియా ప్లేయర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement