IPL 2022 RR VS DC: ఐపీఎల్‌లో గల్లీ క్రికెట్‌ పంచాయతీ.. వైరలవుతున్న 'కుల్చా' కుస్తీ

IPL 2022: Chahal And Kuldeep Yadav Banter Almost Got Missed Amidst Rishabh Pant No Ball Controversy - Sakshi

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 22) జరిగిన రసవత్తర సమరంలో రాజస్థాన్ రాయల్స్‌ 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ హై ఓల్టేజీ పోరులో ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించగా, రాజస్థాన్‌దే పైచేయిగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌ఆర్‌.. జోస్‌ బట్లర్‌ విధ్వంసకర శతకంతో (65 బంతుల్లో 116; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) చెలరేగడంతో 222 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేయగా, ఛేదనలో డీసీ లక్ష్యానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో భారీ స్కోర్లతో పాటు అభిమానులకు కావల్సినంత వినోదం లభించింది. డీసీ లక్ష్యం దిశగా సాగుతున్న సమయంలో అంపైర​ వివాదాస్పద నిర్ణయాన్ని (బంతి నడుము కం‍టే ఎత్తుకు వెళ్లినప్పటికీ నో బాల్‌గా ప్రకటించకపోవడం) నిరసిస్తూ ఢిల్లీ కెప్టెన్‌ చేసిన హంగామా (క్రీజ్‌లో ఉన్న బ్యాటర్లను వెనుక్కు పిలువడం) గల్లీ క్రికెట్‌ను తలపించగా, అదే సమయంలో ఫీల్డ్‌లో ఉన్న చహల్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌), కుల్దీప్‌ యాదవ్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌) మధ్య జరిగిన సరదా సన్నివేశం క్రికెట్‌ లవర్స్‌ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్‌ చేస్తుంది. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి చివరి ఓవర్‌లో 36 పరుగులు అవసరం ​కాగా, ఆ దశలో రోవ్‌మన్‌ పావెల్‌ ఒక్కసారిగి విరుచుకుపడి తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచి (మెక్‌ కాయ్‌ బౌలింగ్‌) మ్యాచ్‌ను డీసీ వైపుకు తిప్పాడు. అయితే మెక్‌ కాయ్‌ వేసిన నాలుగో బంతి నడుం కంటే ఎత్తుకు వెళ్లినప్పటికీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ నో బాల్‌గా ప్రకటించకపోవడంతో వివాదం మొదలైంది. అంపైర్‌ నిర్ణయం పట్ల అసహనానికి గురైన డీసీ సారధి పంత్‌ డగౌట్‌లో నుంచి తమ ఆటగాళ్లను వెనక్కు రావల్సిందిగా సైగలు చేశాడు. 

ఇదే సమయంలో పావెల్‌తో పాటు క్రీజ్‌లో ఉన్న కుల్దీప్‌ యాదవ్‌.. కెప్టెన్‌ పిలుపు మేరకు గ్రౌండ్‌ వదిలే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన ప్రత్యర్ధి బౌలర్‌ చహల్ మైదానం వీడటానికి ప్రయత్నిస్తున్న కుల్దీప్‌ను అడ్డుకుని.. కెప్టెన్‌ పిలిస్తే ఊపుకుంటూ వెళ్లడమేనా.. క్రీజ్‌లోకి నడువ్‌..! అంటూ మెడ పట్టుకుని పిచ్‌పైకి తీశాడు. సరదాగా సాగిన ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. ఇదిలా ఉంటే, నో బాల్ విషయంలో రిషబ్‌ పంత్‌ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంత్‌ అలా ప్రవర్తించడం సరికాదని మాజీలు మండిపడుతున్నారు. కొందరేమో.. ఐపీఎల్‌ పుణ్యమా అని జెంటిల్మెన్‌ గేమ్‌ కాస్త గల్లీ స్థాయి ఆటగా మరిందని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: IPL 2022: అలా చేయడం తప్పే.. థర్డ్‌ అంపైర్‌ జోక్యం చేసుకోవాల్సింది: పంత్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top