IPL 2022 Auction Day 1: తొలి రోజు.. 74 మంది ప్లేయర్లు... రూ. 388 కోట్లు!.. ఫ్రాంఛైజీల పర్సులో మిగిలింది ఎంతంటే!

IPL 2022 Auction Day 1: 74 Players Sold For 388 Crore Remain 173 Crore - Sakshi

బెంగళూరు: పది మంది మార్క్యూ ఆటగాళ్ల జాబితాతో తొలి రోజు వేలం మొదలైంది. అందరికంటే ముందుగా శిఖర్‌ ధావన్‌ పేరు వచ్చింది. రూ. 2 కోట్ల బేస్‌ ప్రైస్‌ (కనీస ధర) విలువ నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌ ముందుకు తీసుకెళ్లింది. చివర్లో ఢిల్లీతో పోటీ పడి పంజాబ్‌ ధావన్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో 192 మ్యాచ్‌ల అపార అనుభవం ఉన్న ఈ భారత క్రికెటర్‌కు సరైన విలువే లభించింది.

అశ్విన్‌ను తీసుకునేందుకు పాత జట్టు ఢిల్లీ ప్రయత్నించినా అతడిని కొత్త టీమ్‌ సొంతం చేసుకుంది. రెండేళ్ల క్రితం రూ. 15 కోట్ల 50 లక్షల మొత్తానికి కమిన్స్‌ను తీసుకున్న కోల్‌కతా ఈసారి అందులో దాదాపు సగం విలువకే అతడిని ఎంచుకోవడం విశేషం. ఫాస్ట్‌ బౌలర్లు రబడ, ట్రెంట్‌ బౌల్ట్‌ కోసం పంజాబ్, రాజస్తాన్‌ భారీ మొత్తం వెచ్చించాయి. 

భారత పేసర్‌ షమీ కోసం మూడు టీమ్‌లు చివరి వరకు పోటీ పడగా, గుజరాత్‌ తగిన విలువకే తీసుకుంది. చెన్నై గత ఐపీఎల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన డు ప్లెసిస్‌ కోసం ఆ జట్టు ఆరంభంలో ముందుకు వచ్చినా ... రూ. 3 కోట్లు దాటగానే తప్పుకుంది. డు ప్లెసిస్‌ను తీసుకున్న బెంగళూరు అతడిని కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. 

డికాక్‌ కోసం పాత జట్టు ముంబై ముందుకు వచ్చి నా, చివరకు కొత్త ఫ్రాంచైజీ లక్నో సొంతం చేసుకుంది. ఎడమచేతివాటం దూకుడైన ఓపెనర్, వికెట్‌కీపర్‌గా లీగ్‌లో తనదైన ముద్ర వేసిన డికాక్‌కు ఓ రకంగా లక్నో చౌక మొత్తానికే ఎంచుకున్నట్లు. విధ్వంసక ఓపెనర్, ఐపీఎల్‌ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన డేవిడ్‌ వార్నర్‌ను ముంబై, చెన్నైలను దాటి ఢిల్లీ తక్కువ మొత్తానికే సొంతం చేసుకోగలిగింది. పంజాబ్‌ కింగ్స్‌ జట్టు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ షారుఖ్‌ ఖాన్‌ను రూ. 9 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.  

మొత్తంగా తొలి రోజు శనివారం వేలంలో 74 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా... ఫ్రాంచైజీలు సుమారు రూ. 388 కోట్లు వెచ్చించాయి. అయితే ఇంకా జట్లలో అన్ని స్థానాలు భర్తీ కాలేదు. కనిష్టంగా మరో 73 స్థానాలు ఖాళీగా ఉండగా టీమ్‌ల వద్ద సుమారు రూ. 173 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆదివారం కొనసాగే వేలంలో ఏ స్థాయి ఆటగాడికైనా తక్కువ మొత్తమే దక్కే అవకాశం ఉంది.    

చదవండి: IPL 2022 Auction: సురేశ్‌ రైనా, స్మిత్‌, షకీబ్‌కు భారీ షాక్‌.. ఎందుకిలా?
IPL 2022 Auction: వేలంలో షాకింగ్‌ ఘటన.. కుప్పకూలిన ఆక్షనీర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top