IPL 2021 Phase 2: నాలాంటి ‘ఓల్డ్‌ మ్యాన్‌’కు కష్టమే: డివిల్లియర్స్‌

IPL 2021: De Villiers Says Humid in UAE Old Man Like Him Needs Stay Fresh - Sakshi

RCB AB de Villiers: క్రికెట్‌ ప్రేమికులకు పొట్టి ఫార్మాట్‌లోని అసలైన మజా అందించేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2021 రెండో దశ త్వరలోనే ఆరంభం కానుంది. ఆటగాళ్లు విజయవంతంగా క్వారంటైన్‌ పూర్తిచేసుకుని, కోవిడ్‌ భయాలేవీ లేకుండా అన్నీ సజావుగా సాగితే ఎంటరైన్‌మెంట్‌కు కొదవే ఉండదు. ఇక.. యూఏఈ వేదికగా జరుగనున్న మిగిలిన మ్యాచ్‌ల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే యూఏఈకి చేరుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ప్లేయర్‌ ఏబీ డివిల్లియర్స్‌ సైతం నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తూ.. చెమటోడుస్తున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆర్సీబీ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా.. ‘‘ఇక్కడ అంతా బాగానే ఉంది. వికెట్‌ కాస్త కఠినంగానే ఉంది. బౌలర్లు చాలా బాగా బౌల్‌ చేస్తున్నారు. అయితే.. ఇక్కడ హుమిడిటీ(ఆర్ద్రత) ఎక్కువ కదా. విపరీతంగా చెమట పట్టేస్తోంది.

బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే, నాలాంటి ముసలివాళ్లకు కాస్త కష్టమే కదా’’ అని 37 ఏళ్ల డివిల్లియర్స్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. చాలా గ్యాప్‌ తర్వాత సహచర ఆటగాళ్లను కలుసుకోవడం గురించి స్పందిస్తూ.. ‘‘ఈ సెషన్‌ చాలా బాగా సాగింది. క్రికెటర్లందరినీ ఒకే చోట చూడటం సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు వాళ్లను చాలా మిస్సయ్యాను. ఇప్పుడు అంతా ఒక్కచోట చేరాం. రేపటి వార్మప్‌ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని డివిల్లియర్స్‌ చెప్పుకొచ్చాడు. కాగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్‌-2021 రెండో అంచె ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

చదవండి: IPL 2021 Phase 2: ఇయాన్‌ మోర్గాన్‌ నా గురించి ఏమనుకుంటున్నాడో..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top