'భయం నన్ను మరింత ఫోకస్‌గా ఉంచుతుంది'

IPL 2021: AB De Villiers Says Fear Of Failure Always Pushes More Focus - Sakshi

చెన్నై: దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏబీ 48 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఆర్‌సీబీ విజయాన్ని అందుకుంది. కాగా నేడు ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ఏబీ డివిలియర్స్‌ తన ప్రాక్టీస్‌కు మరింత పదునుపెట్టాడు. తనకు ఎస్‌ఆర్‌హెచ్‌ అంటే చాలా ఇష్టమని.. ముఖ్యంగా వార్నర్‌ను ఎదుర్కోవడంలో మజా ఉంటుందని బోల్డ్‌ డైరీస్‌లో పేర్కొన్నాడు. అయితే ఏబీ డివిలియర్స్‌ గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత ఎలాంటి మ్యాచ్‌లు ఆడకపోవడం విశేషం. కానీ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే ఒక మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఏబీ తన ఫిట్‌నెస్‌ సీ​క్రెట్‌ ఏంటనేది బోల్డ్‌ డైరీస్‌లో రివీల్‌ చేశాడు.

''గతేడాది ఐపీఎల్‌ తర్వాత మళ్లీ నేను ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదు. అయితే ఈ గ్యాప్‌లో నా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి రెండు- మూడు నెలల పాటు జిమ్‌ సెషన్‌తో పాటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాను. అంతేగాక రోజు బ్యాట్‌ పట్టుకొని గోడకు బంతులను హార్డ్‌గా హిట్టింట్‌ చేసేవాడిని. దీంతో నా ఫోకస్‌ మొత్తం షాట్ల ఎంపికపైనే ఉంది. ఇక నేను మ్యాచ్‌లో ఫెయిల్‌ అవుతానేమోననే భయం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. కానీ అదే నన్ను గేమ్‌పై ఫోకస్‌ చేసేలా చేస్తుంది. మొదటి 20 బంతుల్లోనే దాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తా..'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ఏబీ డివిలియర్స్‌ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రొటీస్‌ తరపున డివిలియర్స్‌ 114 టెస్టుల్లో 8765 పరుగులు, 228 వన్డేల్లో 9577 పరుగులు, 78 టీ20ల్లో 1672 పరుగులు, ఐపీఎల్‌లో 170 మ్యాచ్‌ల్లో 4897 పరుగులు సాధించాడు. అయితే కొన్ని రోజుల క్రితం మళ్లీ తనకు టీ20 ఆడాలని ఉందని.. వచ్చే టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులోకి ఉంటానంటూ సీఎస్‌ఏ(క్రికెట్‌ సౌతాఫ్రికా)కు ఇప్పటికే పేర్కొన్నాడు.
చదవండి: ఎస్‌ఆర్‌హెచ్‌లో అనుకున్నంత బలం లేదు: డివిలియర్స్‌

మ్యాచ్‌ ఓడినందుకు షారుఖ్‌ క్షమాపణ.. స్పందించిన రసెల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top