PBKS Vs RCB: పంజాబ్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ

IPL 2021 2nd Phase Royal Challengers Bangalore Vs Punjab Kings Match Live Updates And Highlights - Sakshi

పంజాబ్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ
ఆర్సీబీ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 6 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై ప్లే ఆఫ్స్‌ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖారారు చేసుకుంది. పంజాబ్‌ గెలుపుకు ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా, హర్షల్‌ పటేల్‌ అద్భుతంగా బౌల్‌ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌ 3 వికెట్లు, షాబాజ్‌ అహ్మద్‌, జార్జ్‌ గార్టన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

ఐదో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌.. మర్క్రమ్‌(20) ఔట్‌
ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్‌ ప్లేయర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. గార్టన్‌ వేసిన 16.5వ ఓవర్లో మర్క్రమ్‌(14 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్‌) క్రిస్టియన్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 128/5. క్రీజ్‌లో షారుఖ్‌ ఖాన్‌(2), హెన్రిక్స్‌ ఉన్నారు.

చహల్‌ మాయాజాలం.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో ఆర్సీబీ బౌలర్‌ చహల్‌ తన అద్భుతమైన స్పిన్‌ మాయాజాలంతో పంజాబ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్‌లో మయాంక్‌ అగర్వాల్‌(42 బంతుల్లో 57), సర్ఫరాజ్‌ ఖాన్‌(0)లను ఔట్‌ చేశాడు. 16 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 121/4. క్రీజ్‌లో మర్క్రమ్‌(15), షారుఖ్‌ ఖాన్‌ ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌.. పూరన్‌(3) ఔట్‌
చహల్‌ వేసిన 13వ ఓవర్‌లో పంజాబ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వన్‌ డౌన్‌ బ్యాటర్‌ పూరన్‌(7 బంతుల్లో 3) పడిక్కల్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 12.5 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 99/2. క్రీజ్‌లో మయాంక్‌ అగర్వాల్‌(36 బంతుల్లో 50), మర్క్రమ్‌ ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌.. రాహుల్‌(39) ఔట్‌
ఆర్సీబీ బౌలర్లకు ఎట్టకేలకు 11వ ఓవర్‌లో వికెట్‌ దక్కింది. షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌ క్యాచ్‌ అందుకోవడంతో కేఎల్‌ రాహుల్‌(35 బంతుల్లో 39; ఫోర్‌, 2 సిక్సర్లు) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. 10.5 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 91/1. క్రీజ్‌లో మయాంక్‌ అగర్వాల్‌(31 బంతుల్లో 47), పూరన్‌ ఉన్నారు.


Photo Courtesy: IPL

ఆచితూచి ఆడుతున్న పంజాబ్‌.. 6 ఓవర్ల తర్వాత 49/0
165 పరుగల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్‌ ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(19 బంతుల్లో 26; ఫోర్‌, 2 సిక్సర్లు), మయాంక్‌ అగర్వాల్‌(18 బంతుల్లో 19; ఫోర్‌చ సిక్స్‌) చెత్త బంతులను బౌండరీలను తరలిస్తూ స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 49/0గా ఉంది.

ఆఖర్లో తడబడ్డ ఆర్సీబీ.. పంజాబ్‌ టార్గెట్‌ 165
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీసీకి శుభారంభం లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. మిడిలార్డర్‌ బ్యాటర్లు విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తొలుత హెన్రిక్స్‌(3/12), ఆఖరి ఓవర్లో షమీ(3/39) ఆర్సీబీని కట్టడి చేశారు. చివరి ఓవర్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చిన షమీ 3 వికెట్లు పడగొట్టాడు. రెండో బంతికి మ్యాక్స్‌వెల్‌(33 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరగగా.. నాలుగో బంతికి షాబాజ్‌ అహ్మద్‌(4 బంతుల్లో 8; సిక్స్‌), జార్జ్‌ గార్టన్‌(0) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యారు. 

సర్ఫరాజ్‌ సూపర్‌ త్రో.. డివిలియర్స్‌(23) రనౌట్‌
సర్ఫరాజ్‌ ఖాన్‌ సూపర్‌ త్రో కారణంగా ఏబీ డివిలియర్స్‌(18 బంతుల్లో 23; ఫోర్‌, 2 సిక్సర్లు) రనౌటయ్యాడు. 18.2 ఓవర్ల ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 146/4. క్రీజ్‌లో మ్యాక్స్‌వెల్‌(50), షాబాజ్‌ అహ్మద్‌ ఉన్నారు. 


Photo Courtesy: IPL

హెన్రిక్స్‌ ఆన్‌ ఫైర్‌.. వరుస ఓవర్లలో 3 వికెట్లు
పంజాబ్‌ బౌలర్‌ మోసస్‌ హెన్రిక్స్‌ చెలరేగి బౌలింగ్‌ చేస్తున్నాడు. వరుస ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టాడు. 10వ ఓవర్‌లో కోహ్లి(25), డేనియల్‌ క్రిస్టియన్‌(0)లను ఔట్‌ చేసిన అతను.. 12వ ఓవర్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌(3 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)ను పెవిలియన్‌కు సాగనంపాడు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 73/3. క్రీజ్‌లో మ్యాక్స్‌వెల్‌(3), ఏబీ డివిలియర్స్‌ ఉన్నారు. 


Photo Courtesy: IPL

వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. 
ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో పంజాబ్‌ బౌలర్‌ మోసస్‌ హెన్రిక్స్‌ ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టాడు. తొలుత విరాట్‌ కోహ్లి(24 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్‌)ని క్లీన్‌ బౌల్డ్‌ చేసిన అతను.. ఆ మరుసటి బంతికే డేనియల్‌ క్రిస్టియన్‌ను డకౌట్‌గా వెనక్కు పంపాడు. 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 69/2. క్రీజ్‌లో పడిక్కల్‌(38), మ్యాక్స్‌వెల్‌(1) ఉన్నారు. 

ఆర్సీబీ దూకుడు..6 ఓవర్ల తర్వాత 55/0
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ దూకుడుగా ఆడుతుంది. ఓపెనర్లు దేవ్‌దత్‌ పడిక్కల్‌(23 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి(13 బంతుల్లో 18; 2 ఫోర్లు) చెలరేగి ఆడడంతో 6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టపో​కుండా 55 పరుగులు చేసింది.  


Photo Courtesy: IPL

షార్జా: ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకానున్న డబుల్‌ హెడర్‌ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇరు జట్లు 27 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా ఆర్సీబీ 12 .. పంజాబ్‌ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ప్రస్తుత సీజన్‌ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో రాహుల్‌ సేన 34 పరుగుల తేడాతో ఆర్సీబీని మట్టికరిపించింది. ఇక ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్ల పాయింట్ల విషయానికొస్తే.. ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో మూడో స్థానంలో ఉండగా, పంజాబ్‌ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. 
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్ : కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మర్క్రమ్‌, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, సర్ఫరాజ్‌ ఖాన్‌, హర్ప్రీత్‌ బ్రార్‌, మోసస్‌ హెన్రిక్స్‌, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్‌ కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top