మన మహిళలు అదుర్స్‌ | Sakshi
Sakshi News home page

మన మహిళలు అదుర్స్‌

Published Fri, Dec 15 2023 4:26 AM

Indian womens team performed beyond expectations - Sakshi

ముంబై: రెండేళ్ల విరామం తర్వాత టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగిన భారత మహిళల జట్టు అంచనాలకు మించి రాణించింది. ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల ఏకైక టెస్టులో మన బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించడంతో తొలి రోజే రికార్డు స్కోరు నమోదైంది. ఆట ముగిసే సమయానికి భారత్‌ 94 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. మహిళల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒకే రోజు నమోదైన పరుగుల జాబితాను చూస్తే ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం.

శుభ సతీశ్‌ (76 బంతుల్లో 69; 13 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్‌ (99 బంతుల్లో 68; ), యస్తిక భాటియా (88 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్‌), దీప్తి శర్మ (95 బంతుల్లో 60 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించగా, కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (81 బంతుల్లో 49; 6 ఫోర్లు) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకుంది. ప్రస్తుతం దీప్తితో పాటు పూజ వస్త్రకర్‌ (4 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉంది.  డీవై పాటిల్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది.

భారత్‌ తరఫున ముగ్గురు ప్లేయర్లు జెమీమా, రేణుకా సింగ్, శుభ సతీశ్‌ ఈ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. వీరిలో శుభకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా. ఓపెనర్లు షఫాలీ వర్మ (19), స్మృతి మంధాన (17) తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా, ఆ తర్వాత భారత బ్యాటర్లు క్రీజ్‌లో పట్టుదలగా నిలబడ్డారు. కుదురుకున్న తర్వాత వేగంగా పరుగులు సాధించారు. మూడు భారీ భాగస్వా మ్యాలతో జట్టును నడిపించారు. శుభ, రోడ్రిగ్స్‌ మూడో వికెట్‌కు 115 పరుగులు... యస్తిక, హర్మన్‌ ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించగా... దీప్తి, స్నేహ్‌ రాణా (73 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఏడో వికెట్‌కు 92 పరుగులు జత చేయడం విశేషం.  

స్కోరు వివరాలు  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: స్మృతి (బి) బెల్‌ 17; షఫాలీ (బి) క్రాస్‌ 19; శుభ (సి) సివర్‌ (బి) ఎకెల్‌స్టోన్‌ 69; జెమీమా (బి) బెల్‌ 68; హర్మన్‌ప్రీత్‌ (రనౌట్‌) 49; యస్తిక (సి) బెల్‌ (బి) డీన్‌ 66; దీప్తి (బ్యాటింగ్‌) 60; స్నేహ్‌ రాణా (బి) సివర్‌ 30; పూజ (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు 28; మొత్తం (94 
ఓవర్లలో 7 వికెట్లకు) 410. వికెట్ల పతనం: 1–25, 2–47, 3–162, 4–190, 5–306, 6–313, 7–405. బౌలింగ్‌: కేట్‌ క్రాస్‌ 14–0–64–1, లారెన్‌ బెల్‌ 15–1–64–2, నాట్‌ సివర్‌ 11–4–25–1, లారెన్‌ 15–1–84–0, చార్లీ డీన్‌ 17–1–62–1, సోఫీ ఎకెల్‌స్టోన్‌ 22–4–85–1.  

2  మహిళల టెస్టు క్రికెట్‌లో ఒకేరోజు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో భారత జట్టు రెండో స్థానం (410)లో నిలిచింది. 1935లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ ఒకే రోజు 431 పరుగులు సాధించింది. సొంతగడ్డపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కూడా.   

Advertisement
Advertisement