పసిడి పతకంపై గురి | India womens recurve team enters final Archery World Cup | Sakshi
Sakshi News home page

పసిడి పతకంపై గురి

Jun 26 2021 4:45 AM | Updated on Jun 26 2021 4:45 AM

India womens recurve team enters final Archery World Cup - Sakshi

పారిస్‌: టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ సంపాదించడంలో విఫలమైన భారత మహిళల రికర్వ్‌జట్టు వరల్డ్‌కప్‌ ఆర్చరీ స్టేజ్‌–3 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో దీపిక కుమారి, అంకిత భకత్, కోమలికలతో కూడిన భారత జట్టు 6–2తో ఆరో ర్యాంకర్‌ ఫ్రాన్స్‌ జట్టును ఓడించింది. తొలి సెట్‌ను 57–51తో... రెండో సెట్‌నూ 57–51తో నెగ్గిన భారత జట్టు 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే మూడో సెట్‌ను దీపిక బృందం 54–55తో కోల్పోయి ఫ్రాన్స్‌కు రెండు పాయింట్లు కోల్పోయింది.

కానీ నాలుగో సెట్‌లో తేరుకున్న భారత్‌ 56–54తో గెలిచి ఓవరాల్‌గా 6–2 స్కోరుతో విజయాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో మెక్సికో జట్టుతో భారత్‌ తలపడుతుంది. ఏప్రిల్‌లో గ్వాటెమాలా సిటీలో జరిగిన వరల్డ్‌కప్‌ స్టేజ్‌–1 టోర్నీలో భారత మెక్సికోను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్‌లో 6–0తో (59–52; 55–49; 56–52) స్పెయిన్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా 6–0తో (54–49; 59–54; 54–51) టర్కీపై విజయం సాధించింది.

పురుషుల రికర్వ్‌ టీమ్‌ విభాగంలో అతాను దాస్, తరుణ్‌దీప్‌ రాయ్, ప్రవీణ్‌ జాదవ్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4–5తో ఓడింది. నాలుగు సెట్‌లు ముగి శాక రెండు జట్టు 4–4తో సమంగా నిలిచాయి. అయితే ‘షూట్‌ ఆఫ్‌’లో జర్మనీ 27–26తో భారత్‌ను ఓడించింది. కాంపౌండ్‌ మహిళల టీమ్‌ విభాగంలో జ్యోతి సురేఖ, సాంచీ, అక్షతలతో కూడిన భారత జట్టు తొలి రౌండ్‌లో 225–228తో ఫ్రాన్స్‌ జట్టు చేతిలో ఓడింది. కాంపౌండ్‌ పురుషుల టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ, అమన్, రజత్‌ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్లో ‘షూట్‌ ఆఫ్‌’లో 25–29తో ఫ్రాన్స్‌ చేతిలో ఓటమి చవిచూసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement