India Vs SL 3rd T20:టీమిండియా ఘోర ఓటమి..సిరీస్‌ శ్రీలంక వశం

India Vs Sri Lanka 3rd T20 Live Updates And Highlights - Sakshi

టీమిండియా ఘోర ఓటమి..సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక

శ్రీలంకతో జరిగిన మూడో  టీ20లో భారత్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో రాణించిన శ్రీలంక భారత్ పై 7 వికెట్లతేడాతో  ఘన విజయం సాధించింది. దీంతో శ్రీలంక 2-1 తేడాతో సీరీస్‌ కైవసం చేసుకుంది. 82  పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆడుతూ పాడుతూ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.భారత బౌలర్లలో రాహుల్ చాహార్ మూడు వికెట్లు పడగొట్టాడు.

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా శ్రీలంక లంక బౌలర్ల ధాటికి 81 పరుగులకే కుప్పకులిపోయింది. శ్రీలంక స్పిన్నర్‌ హసరంగ నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బతీశాడు. ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో నిలబడలేకపోయారు. బౌలర్ కుల్‌దీప్ యాదవ్(23) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.. 

మూడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక..సమరవిక్రమ(6)ఔట్‌

రాహుల్‌ చాహర్‌ దాటికి 82 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక మూడో వికెట్‌ కోల్పోయింది. సమరవిక్రమ(6) ను రాహుల్‌ చాహర్‌ బౌల్డ్‌ రూపంలో పెవిలియన్‌కు పంపాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక..మినోద్ భానుక (18)ఔట్‌
82 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  35 పరుగుల వద్ద  శ్రీలంక రెండో వికెట్‌  కోల్పోయింది. మినోద్ భానుక (18) రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. అవిష్క ఫెర్నాండో(12) ఔట్‌
82 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 23 పరుగుల స్కోర్‌ వద్ద శ్రీలంక తొలి వికెట్‌ను కోల్పోయింది.​ ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో(18 బంతుల్లో 12; ఫోర్‌)ను రాహుల్‌ చాహర్‌ పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 23/1. క్రీజ్‌లో భానుక(8), సమరవిక్రమ(0) ఉన్నారు. 

టీమిండియా చెత్త ప్రదర్శన..లంక టార్గెట్‌ 82
టీమిండియా ప్లేయర్లు తమ చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. రెండో టీ20లో కనీసం మూడంకెల స్కోర్‌నైనా చేయగలిగిన భారత్‌.. ఈ మ్యాచ్‌లో కనీసం 100 పరుగుల మార్కును కూడా చేరుకోలేక దారుణంగా విఫలమైంది. లంక బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 81 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత జట్టులో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్‌ కాగా, మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. కుల్దీప్‌ యాదవ్‌ 23 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లు హసరంగ(4/9), షనక(2/20), మెండిస్‌(1/13), చమీర(1/16) అద్భుతంగా రాణించారు. 

8వ వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. వరుణ్‌ చక్రవర్తి డకౌట్‌
బర్త్‌ డే బాయ్‌ హసరంగ మరోసారి మ్యాజిక్‌ చేశాడు. టీమిండియా ప్లేయర్‌ వరుణ్‌ చక్రవర్తిని అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపాడు. కరుణరత్నే క్యాచ్‌ అందుకోవడంతో వరుణ్‌ చక్రవర్తి డకౌట్‌గా వెనుదిరిగాడు. 16.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 63/8. క్రీజ్‌లో కుల్దీప్‌ యాదవ్‌(12), చేతన్‌ సకారియా ఉన్నారు.

రాహుల్‌ చాహర్‌(5) ఔట్‌.. 62 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
లంక బౌలర్ల ధాటికి టీమిండియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుంది. షనక బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ భానుక క్యాచ్‌ అందుకోవడంతో రాహుల్‌ చాహర్‌(5) పెవిలియన్‌ బాటపట్టాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 62/7.  క్రీజ్‌లో కుల్దీప్‌ యాదవ్‌(12), వరుణ్‌ చక్రవర్తి ఉన్నారు.

చెలరేగుతున్న హసరంగ.. 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా
లంక స్పిన్నర్‌ హసరంగ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తన స్పిన్‌ మాయాజాలంతో టీమిండియా బ్యాట్స్‌మెన్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో భువనేశ్వర్‌ కుమార్‌(16)ను ఔట్‌ చేయడంతో టీమిండియా 55  పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 55/6. క్రీజ్లో కుల్దీప్‌ యాదవ్‌(9), రాహుల్‌ చాహర్‌ ఉన్నారు.

36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా
టీమిండియా బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. లంక కెప్టెన్‌ షనక బౌలింగ్‌లో నితీశ్‌ రాణా(6) ఔటయ్యాడు. షనక అద్భుతమైన రిటర్న్‌ క్యాచ్‌ అందుకోవడంతో రాణా పెవిలియన్‌ బాట పట్టక తప్పలేదు. దీంతో 36 పరుగులకే టీమిండియా సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. క్రీజ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌(6), కుల్దీప్‌ యాదవ్‌ ఉన్నారు. 

హసరంగ మాయాజాలం.. 25 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌
లంక స్పిన్నర్‌ హసరంగ టీమిండియా బ్యాట్స్‌మెన్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. 5వ ఓవర్‌ నాలుగో బంతికి సామ్సన్‌ వికెట్‌ పడగొట్టిన హసరంగ ఇదే ఓవర్‌ ఆఖరి బంతికి రుతురాజ్‌(14)ను కూడా ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 25/4. క్రీజ్‌లో నితీశ్‌ రాణా(1), భువనేశ్వర్‌ కుమార్‌ ఉన్నారు.

పెవిలియన్‌కు క్యూ కట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్లు.. సామ్సన్ డకౌట్‌
హసరంగ వేసిన 5వ ఓవర్‌లో టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. ఆదుకుంటాడనుకున్న సంజూ సామ్సన్‌ మరోసారి దారుణంగా నిరాశపరిచాడు. హసరంగ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 4.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 24/3. క్రీజ్లో రుతురాజ్‌ గైక్వాడ్‌(14), నితీశ్‌ రాణా ఉన్నారు.

టీమిండియాకు మరో షాక్‌.. పడిక్కల్‌(9) ఔట్‌
జట్టు స్కోర్‌ 23 పరుగుల వద్ద నుండగా టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ పడిక్కల్‌(15 బంతుల్లో 9; ఫోర్‌)ను రమేశ్‌ మెండిస్‌ ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. 4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 23/2. క్రీజ్‌లోకి సంజూ సామ్సన్‌ వచ్చాడు. 

తొలి ఓవర్‌లోనే టీమిండియాకు భారీ షాక్‌.. ధవన్‌ డకౌట్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు తొలి ఓవర్లోనే భారీ షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే కెప్టెన్‌ ధవన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. చమీరా బౌలింగ్‌లో ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న డిసిల్వాకు క్యాచ్‌ ఇచ్చి గోల్డన్‌ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. 0.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 5/1. పడిక్కల్‌(5)కు జోడీగా రుతురాజ్‌ గైక్వాడ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

కొలొంబో: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. సిరీస్‌లోని తొలి టీ20లో టీమిండియా 38 పరుగుల తేడాతో విజయం సాధించగా, బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో(రెండో టీ20) ఆతిధ్య లంక జట్టు 4 వికెట్లు తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో గెలుపుతో సమానంగా నిలువగా, నేటి మ్యాచ్‌ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. టీమిండియాలో నవ్‌దీప్‌ సైనీ స్థానంలో సందీప్‌ వారియర్‌ బరిలోకి దిగనుండగా, లంక జట్టులో ఇసురు ఉదానకు బదులు పతుమ్‌ సిసంకా జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌ ద్వారా సందీప్‌ వారియర్‌ టీ20 అరంగేట్రం చేయనున్నాడు.  


తుది జట్లు:
భారత్: శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ , దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కీపర్), నితీశ్ రాణా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చహర్, సందీప్‌ వారియర్‌, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా.

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక (కీపర్), సదీరా సమర విక్రమా, దనుంజయ డిసిల్వా, రమేశ్ మెండీస్, డసన్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ, పతుమ్‌ సిసంకా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top