IND vs PAK: వానదే విజయం

India vs Pakistan match cancelled - Sakshi

భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ రద్దు

భారీ వర్షంతో సాగని ఆట

‘సూపర్‌ 4’కు పాకిస్తాన్‌  

రేపు నేపాల్‌తో భారత్‌ ‘ఢీ’  

పల్లెకెలె: భారత్‌తో ఆసియా కప్‌ పోరులో పాకిస్తాన్‌ విజయలక్ష్యం 267 పరుగులు... పాక్‌ దీనిని ఛేదిస్తుందా లేక తొలి ఇన్నింగ్స్‌ తరహాలో భారత బౌలర్లు కూడా చెలరేగి ప్రత్యచ్చిని కట్టడి చేస్తారా... ఇరు జట్ల అభిమానుల్లో ఉత్కంఠ... అయితే అందరి ఆసక్తిపై వర్షం నీళ్లు చల్లింది... పాకిస్తాన్‌ అసలు బ్యాటింగ్‌కు దిగే అవకాశమే రాలేదు. అత్యంత ఆసక్తికర, హోరాహోరీ సమరంగా అంచనాలు పెంచిన మ్యాచ్‌ చివరకు వరుణుడి బారిన పడింది.

శనివారం భారత్, పాకిస్తాన్‌ మధ్య లీగ్‌ మ్యాచ్‌ వాన కారణంగా రద్దయింది. భారత్‌ ఇన్నింగ్స్‌ పూర్తిగా సాగగా, ఆపై వానదే విజయమైంది. అర్ధాంతరంగా ముగిసిన మ్యాచ్‌లో టాప్‌–4 విఫలం కావడం భారత్‌ కోణంలో నిరాశపర్చే అంశం కాగా... ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌ చెప్పుకోదగ్గ విశేషం. ముగ్గురు ప్రధాన పేసర్లు చెలరేగడం పాకిస్తాన్‌కు సంబంధించి పెద్ద సానుకూలాంశం. 

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్‌ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ఇషాన్‌ కిషన్‌ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. షాహిన్‌ అఫ్రిది (4/35) బౌలింగ్‌ హైలైట్‌ కాగా, నసీమ్‌ షా, హారిస్‌ రవూఫ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. తొలి మ్యాచ్‌ నెగ్గిన పాకిస్తాన్‌ ఈ ఫలితంతో ‘సూపర్‌–4’ దశకు చేరగా, రేపు నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే సూపర్‌–4 దశకు అర్హత సాధిస్తుంది.   

టాప్‌–4 విఫలం... 
రోహిత్‌ శర్మ (22 బంతుల్లో 11; 2 ఫోర్లు), గిల్‌ (32 బంతుల్లో 10; 1 ఫోర్‌) కలిసి జాగ్రత్తగా భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. రోహిత్‌ రెండు బౌండరీలు కొట్టినా గిల్‌ పదో బంతికి గానీ తొలి పరుగు చేయలేకపోయాడు. పాక్‌ బౌలర్ల జోరుతో కొద్ది వ్యవధిలోనే అంతా మారిపోయింది. చక్కటి బంతితో రోహిత్‌ను క్లీన్‌»ౌల్డ్‌ చేసి షాహిన్‌ మొదటి దెబ్బ కొట్టగా, అతని తర్వాతి ఓవర్లోనే కోహ్లి (4) బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు.

దాదాపు ఆరు నెలల విరామం తర్వాత మైదానంలోకి దిగిన శ్రేయస్‌ (14), కెరీర్‌లో పాక్‌తో తొలి మ్యాచ్‌లో తడబడుతూనే ఆడిన గిల్‌ను రవూఫ్‌ పెవిలియన్‌ పంపించాడు. దాంతో 66/4తో భారత్‌ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో కిషన్, పాండ్యా భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. తాను ఆడిన గత మూడు వన్డేల్లో (వెస్టిండీస్‌తో) అర్ధసెంచరీలు సాధించిన కిషన్‌ ఇక్కడా అదే ఫామ్‌ను కొనసాగించగా... పాండ్యా పాక్‌పై మరోసారి సత్తా చాటాడు.

వీరిద్దరు పాక్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ చక్కటి సమన్వయంతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 54 బంతుల్లో కిషన్, పాండ్యా 62 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వికెట్ల మధ్య పరుగెత్తడంలో కొంత ఇబ్బంది పడిన కిషన్‌ భారీ షాట్‌కు ప్రయత్నించడంతో ఈ భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పాండ్యా సహా 7 బంతుల వ్యవధిలో జట్టు తర్వాతి 3 వికెట్లు కోల్పోగా, నసీమ్‌ 49వ ఓవర్లో 2 వికెట్లతో భారత్‌ ఆట ముగించాడు.  

మళ్లీ మళ్లీ అడ్డుపడి... 
భారత జట్టు ఇన్నింగ్స్‌ సమయంలో రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించింది. 4.2 ఓవర్ల తర్వాత (స్కోరు 15/0) 33 నిమిషాల పాటు... 11.2 ఓవర్ల తర్వాత (స్కోరు 51/3) 20 నిమిషాల పాటు ఆట ఆగిపోయింది. భారత్‌ ఇన్నింగ్స్‌ ముగియగానే విరామ సమయంలో వచ్చిన వర్షం కారణంగా సమయం నష్టపోవాల్సి వచ్చింది. ఎంతసేపు నిరీక్షించినా తెరిపి లభించలేదు. రెండు సార్లు అంపైర్లు పరీక్షించినా ఆ వెంటనే చినుకులు రావడంతో పరిస్థితి మొదటికొచ్చింది. చివరకు రాత్రి గం. 9.52కు మ్యాచ్‌ రద్దు చేయక తప్పలేదు.   

5  భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య ఇప్పటి వరకు రద్దయిన వన్డే మ్యాచ్‌లు. రెండు జట్ల మధ్య మొత్తం 133 మ్యాచ్‌లు జరిగాయి. 55 మ్యాచ్‌ల్లో భారత్, 73 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ గెలుపొందాయి.  

26 వన్డే ఫార్మాట్‌లో భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ రద్దు కావడం 26 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1997లో టొరంటోలో జరిగిన సహారా కప్‌లో చివరిసారి ఈ రెండు జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ ఫలితం తేలకుండానే రద్దయింది.   

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) షాహిన్‌ 11; గిల్‌ (బి) రవూఫ్‌ 10; కోహ్లి (బి) షాహిన్‌ 4; శ్రేయస్‌ (సి) ఫఖర్‌ (బి) రవూఫ్‌ 14; కిషన్‌ (సి) బాబర్‌ (బి) రవూఫ్‌ 82; పాండ్యా (సి) సల్మాన్‌ (బి) షాహిన్‌ 87; జడేజా (సి) రిజ్వాన్‌ (బి) షాహిన్‌ 14; శార్దుల్‌ (సి) షాదాబ్‌ (బి) నసీమ్‌ 3; కుల్దీప్‌ (సి) రిజ్వాన్‌ (బి) నసీమ్‌ 4; బుమ్రా (సి) సల్మాన్‌ (బి) నసీమ్‌ 16; సిరాజ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్‌) 266. వికెట్ల పతనం: 1–15, 2–27, 3–48, 4–66, 5–204, 6–239, 7–242, 8–242, 9–261, 10–266. బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 10–2–35–4, నసీమ్‌ షా 8.5–0–36–3, రవూఫ్‌ 9–0–58–3, షాదాబ్‌ 9–0–57–0, నవాజ్‌ 8–0–55–0, సల్మాన్‌ 4–0–21–0.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top