ఇంగ్లండ్‌తో టీ20, వన్డేల సిరీస్ అనంతరం భారత పురుషల క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది.
ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు మ్యాచ్ ఆగస్టు 15 నుండి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అదేవిధంగా రెండో టెస్టు మ్యాచ్( ఆగస్టు 23 నుండి 27)కు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా జరగనుంది.
లంకతో సిరీస్ భారత్‌కు చాలా కీలకం. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. టీమిండియా ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా, కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో(48.15 పీసీటీ) ఐదవ స్ధానంలో నిలిచింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను గిల్ సేన సజీవంగా ఉంచుకోవాలంటే శ్రీలంక గడ్డపై ఖచ్చితంగా గెలవాల్సిందే. అయితే లంకేయులను వారి స్వదేశంలో ఓడించడం అంత ఈజీ కాదు. శ్రీలంక జట్టు గత కొంత కాలంగా సొంత గడ్డపై అద్భుత విజయాలతో దూసుకుపోతోంది.
ఈ దశాబ్దంలో ఆడిన 21 టెస్ట్ మ్యాచ్‌లలో 11 విజయాలను శ్రీలంక నమోదు చేసింది. కాగా 2017 తర్వాత భారత్ టెస్టుల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అప్పట్లో విరాట్ సారథ్యంలో భారత్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.


