చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌ నయా చరిత్ర

India, Russia Announced As Joint Winners At Chess Olympiad - Sakshi

చెన్నై: తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టు నయా చరిత్ర సృష్టించింది. తొలిసారి స్వర్ణం సాధించి కొత్త రికార్డును లిఖించింది. ఈ మెగా టోర్నీలో రష్యాతో కలిసి భారత్‌ సంయుక్తంగా పసిడి గెలుచుకుంది. ఇది చెస్‌ ఒలింపియాడ్‌ చరిత్రలో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన . గతంలో వరల్డ్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత్‌.. ఈసారి స్వర్ణాన్ని ఒడిసి పట్టింది. ఫలితంగా 93 ఏళ్ల చెస్‌ ఒలింపియాడ్‌ చరిత్రలో భారత్‌కు తొలిసారి స్వర్ణం వచ్చినట్లయ్యింది. భారత్‌ పైనల్‌కు చేరడంలో  ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు.

పోలాండ్‌ జట్టుతో శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్‌ టైబ్రేక్‌లో 1–0తో గెలవడంతో ఫైనల్‌కు చేరింది. మరొక సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో అమెరికాపై రష్యా గెలిచి ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది. భారత్‌-రష్యా జట్ల మధ్య  ఆదివారం జరిగిన ఫైనల్లో పూర్తిగా జరగలేదు. ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన ఈ ఫైనల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత్‌-రష్యాలను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. అంతకుముందు చెస్‌ ఒలింపియాడ్‌లో భారత అత్యుత్తమ ప్రదర్శన కాంస్య పతకం. 2014లో భారత్‌ కాంస్య పతకం సాధించగా, ఆరేళ్ల తర్వాత స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుని భారత్‌ నయా చరిత్ర సృష్టించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top