ఇండియా-ఎ టీమ్ కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. కిష‌న్‌, క‌రుణ్ నాయ‌ర్‌కు పిలుపు? | India As Probable Squad for Unofficial Tests vs England Lions | Sakshi
Sakshi News home page

ఇండియా-ఎ టీమ్ కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. కిష‌న్‌, క‌రుణ్ నాయ‌ర్‌కు పిలుపు?

May 11 2025 5:31 PM | Updated on May 11 2025 5:41 PM

India As Probable Squad for Unofficial Tests vs England Lions

భార‌త క్రికెట్ జ‌ట్టు ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025-27లో భాగంగా జ‌ర‌గ‌నుంది. ఈ సిరీస్‌లో ఎలాగైనా గెలిచి డ‌బ్ల్యూటీసీ కొత్త సైకిల్‌లో బోణీ కొట్టాల‌ని టీమిండియా భావిస్తోంది. జూన్ 20 నుంచి భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టును బీసీసీఐ మే 23న ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. ఈ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు కొత్త కెప్టెన్‌తో వెళ్ల‌నుంది.

రోహిత్ శ‌ర్మ టెస్టుల‌కు విడ్కోలు ప‌లక‌డంతో టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ రానున్నాడు. కెప్టెన్సీ రేసులో శుబ్‌మ‌న్ గిల్ ముందు వ‌రుస‌లో ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉండ‌గా.. ఈ టెస్టు సిరీస్‌కు ముందు భార‌త‌-ఎ జ‌ట్టు కూడా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఇండియా-ఎ జ‌ట్టు ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు మే 26 నుండి జూన్ 19 వరకు జరగ‌నున్నాయి.

ఈ అనాధికారిక సిరీస్ కోసం భార‌త-ఎ జ‌ట్టును బీసీసీఐ మే 13 న ప్ర‌కటించనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ జ‌ట్టు కెప్టెన్‌గా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను ఎంపిక చేయాల‌ని సెల‌క్ట‌ర్లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అయ్య‌ర్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌-2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఒక‌వేళ పంజాబ్ కింగ్స్ ఫైన‌ల్‌కు చేరితే అయ్య‌ర్ తొలి అనాధికారిక టెస్టుకు దూర‌మయ్యే అవ‌కాశ‌ముంది.

అయితే ప్ర‌స్తుతం మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఐపీఎల్ సీజ‌న్ తిరిగి మే 15 నుంచి ప్రారంభ‌మ‌య్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ఒక‌వేళ ఐపీఎల్ తిరిగి ప్రారంభమ‌వ్వ‌డం ఆల‌స్యమైతే భార‌త‌-ఎ జ‌ట్టుతో పాటే అయ్య‌ర్ ఇంగ్లండ్‌కు వెళ్ల‌నున్నాడు. శ్రేయ‌స్‌తో పాటు కరుణ్ నాయ‌ర్, ఇషాన్ కిష‌న్‌ల‌ను కూడా భార‌త‌-ఎ జ‌ట్టుకు ఎంపిక చేయాల‌ని సెల‌క్ట‌ర్లు యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

సాయి సుద‌ర్శ‌న్‌, అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, తనుష్ కోటియన్‌ల‌ను కూడా ఇండియా-ఎ జ‌ట్టు త‌ర‌పున ఇంగ్లండ్ పంప‌ననున్న‌ట్లు వినికిడి. ప్ర‌ధాన జ‌ట్టులో ఉండే చాలా మంది ఆట‌గాళ్లు ఇండియా-ఎ జ‌ట్టు త‌ర‌పున ఆడ‌నున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement