గిల్‌ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం | Sakshi
Sakshi News home page

గిల్‌ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం

Published Thu, May 2 2024 12:50 PM

India Great Slams BCCI For Ignoring CSK Star T20 WC Favouritism Bombshell

టీ20 ప్రపంచకప్‌-2024 జట్టు ప్రకటన నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి నిర్ణయాలపై మాజీ కెప్టెన్‌ క్రిష్టమాచారి శ్రీకాంత్‌ మండిపడ్డాడు. తమకు ఇష్టమైన ఆటగాళ్ల ప్రదర్శన బాగా లేకపోయినా వారికి వరుస అవకాశాలు ఇస్తోందంటూ మేనేజ్‌మెంట్‌ తీరును తప్పుబట్టాడు.

తమకు నచ్చిన వాళ్లను ఎంపిక చేసేందుకు.. అర్హత కలిగిన ఆటగాళ్లను పక్కనపెట్టడం ద్వంద్వనీతికి నిదర్శనం అంటూ బీసీసీఐ విధానాలను విమర్శించాడు. కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానుంది.

ఐర్లాండ్‌తో జూన్‌ 5 నాటి మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.

శుబ్‌మన్‌ గిల్‌ అసలు ఫామ్‌లోనే లేడు
ఇందులో ఓపెనర్ల కోటాలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి చోటు దక్కించుకోగా.. శుబ్‌మన్‌ గిల్‌ రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ స్పందిస్తూ.. ‘‘శుబ్‌మన్‌ గిల్‌ అసలు ఫామ్‌లోనే లేడు.

అయినా అతడికి జట్టులో స్థానం కల్పించారు. నిజానికి రుతురాజ్‌ గైక్వాడ్‌కు టీమ్‌లో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. 17 ఇన్నింగ్స్‌లో 500 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టు మీద సెంచరీ చేశాడు.

కానీ సెలక్టర్లకు శుబ్‌మన్‌ గిల్‌ మాత్రమే కనిపిస్తాడు. వరుసగా విఫలమైనా అతడికే ఛాన్సులు ఇస్తారు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఏ ఫార్మాట్లోనైనా వరుస వైఫల్యాలు జట్టులో అతడి స్థానాన్ని ప్రశ్నార్థకం చేయలేవు.

తమకు నచ్చిన ఆటగాళ్లకే
సెలక్షన్‌ విషయంలో ఫేవరిటిజం ఉంది. తమకు నచ్చిన ఆటగాళ్లకే సెలక్టర్లు అవకాశం ఇచ్చారు’’ అంటూ తూర్పారబట్టాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ చీకి చిక్కా వేదికగా కృష్ణమాచారి శ్రీకాంత్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 

కాగా ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్‌లో కలిపి 509 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.

మరోవైపు.. శుబ్‌మన్‌ గిల్‌ గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా, ఆటగాడిగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 320 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో చిక్కా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

టీ20 ప్రపంచకప్‌-2024కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్‌ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.

చదవండి: వరల్డ్‌కప్‌కు సెలక్టయ్యాడు.. వెంటనే డకౌటయ్యాడు! వీడియో
 

Advertisement
 
Advertisement
 
Advertisement