స్వయంకృతం! | India finds itself in trouble in the fourth Test | Sakshi
Sakshi News home page

స్వయంకృతం!

Dec 28 2024 3:48 AM | Updated on Dec 28 2024 3:48 AM

India finds itself in trouble in the fourth Test

నాలుగో టెస్టులో భారత్‌ ఎదురీత

153/2 నుంచి 164/5

యశస్వి జైస్వాల్‌ అర్ధ సెంచరీ

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 474 ఆలౌట్‌

స్టీవ్‌ స్మిత్‌ భారీ శతకం 

టీమిండియా చక్కటి అవకాశాన్ని చేజేతులా చెడగొట్టుకుంది. మెల్‌బోర్న్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో 153/2తో పటిష్ట స్థితిలో నిలిచిన భారత్‌ 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. రెండో రోజును 164/5 వద్ద ముగించి ఫాలోఆన్‌ ఎదుర్కొనే ప్రమాదంలో పడింది. ఒక్క అనవసర రనౌట్‌ భారత ఇన్నింగ్స్‌ గతినే మార్చేసింది. 

స్మిత్‌ భారీ సెంచరీకి లోయర్‌ ఆర్డర్‌ సహకారం తోడవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగా... ఆసీస్‌ సారథి కమిన్స్‌ చూపిన తెగువ మన టాపార్డర్‌లో లోపించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఏదైనా ఆశ మిగిలుందంటే అది పంత్, జడేజా క్రీజులో ఉండటమే. మరి ఈ జోడీ మూడో రోజు ఆసీస్‌ పేసర్లను ఎలా ఎదుర్కుంటుందనే దానిపైనే భారత జట్టు ఆశలు ఆధారపడి ఉన్నాయి.   

మెల్‌బోర్న్‌: బౌలర్ల అసహాయతకు, బ్యాటర్ల నిర్లక్ష్యం తోడవడంతో ప్రతిష్టాత్మక ‘బోర్డర్‌–గావస్కర్‌’ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్‌ కష్టాల్లో పడింది. ప్రత్యర్థి బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్న పిచ్‌పై మనవాళ్లు కనీస ప్రదర్శన కనబర్చలేకపోవడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 

ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (118 బంతుల్లో 82; 11 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో రాణించగా... విరాట్‌ కోహ్లి (36; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్, బోలండ్‌ రెండేసి వికెట్లు తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న టీమిండియా... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 310 పరుగులు వెనుకబడి ఉంది. 

రిషభ్‌ పంత్‌ (6 బ్యాటింగ్‌), రవీంద్ర జడేజా (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఫాలోఆన్‌ తప్పించుకోవాలంటే రోహిత్‌ బృందం ఇంకా 111 పరుగులు చేయాల్సి ఉంది. 

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 311/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ్రస్టేలియా 122.4 ఓవర్లలో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (197 బంతుల్లో 140; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... కమిన్స్‌ (49; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో బుమ్రా 4, జడేజా 3 వికెట్లు పడగొట్టారు.  

ఒక్క రనౌట్‌తో... 
సాఫీగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌లో రనౌట్‌ చిచ్చు పెట్టింది. చూడచక్కటి షాట్లతో సెంచరీ దిశగా సాగుతున్న జైస్వాల్‌... బోలండ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 41వ ఓవర్‌ చివరి బంతిని మిడాన్‌ వైపు కొట్టి సింగిల్‌ కోసం పరిగెత్తాడు. కానీ నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌లో కోహ్లి స్పందించలేదు. అప్పటికే యశస్వి సగం పిచ్‌ దాటి వచ్చేశాడు. 

మిడాన్‌ వద్ద కమిన్స్‌ బంతిని అందుకొని కీపర్‌ కేరీ వైపు విసరడం అతను వికెట్లు గిరాటేయడం జరిగిపోయింది. దాంతో యశస్వి నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో యశస్వి–కోహ్లి మూడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. యశస్వి రనౌట్‌తో ఏకాగ్రత కోల్పోయిన కోహ్లి ఈ సిరీస్‌లో మరోసారి తన బలహీనతను బయట పెట్టుకున్నాడు. బోలండ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 43వ ఓవర్‌ తొలి బంతికి కోహ్లి అవుటయ్యాడు.

ఆఫ్‌స్టంప్‌ అవతల వెళుతున్న బంతిని అనవసరంగా ఆడి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. నైట్‌ వాచ్‌మన్‌ ఆకాశ్‌దీప్‌ (0) కూడా అవుటవ్వడంతో భారత జట్టు సగం వికెట్లు కోల్పోయింది. గత రెండు మ్యాచ్‌ల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి విఫలమైన రోహిత్‌ (3) ఓపెనర్‌గానూ నిరాశ పరచగా... కేఎల్‌ రాహుల్‌ (24; 3 ఫోర్లు) కమిన్స్‌ అద్భుతమైన బంతికి బౌల్డయ్యాడు.  

స్మిత్‌ సూపర్‌ సెంచరీ 
భారత బౌలింగ్‌ లోటుపాట్లను సొమ్ముచేసుకున్న స్మిత్‌ రెండో రోజు ఆసీస్‌కు భారీ స్కోరు సాధించి పెట్టాడు. బుమ్రా మినహా ఇతర బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండటంతో సునాయాసంగా పరుగులు రాబట్టాడు. అతడికి మరో ఎండ్‌ నుంచి కమిన్స్‌ చక్కటి సహకారం అందించాడు. 

ఈ క్రమంలో స్మిత్‌ 167 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడికిది 34వ శతకం. ఏడో వికెట్‌కు 112 పరుగులు జోడించిన అనంతరం కమిన్స్‌ అవుట్‌ కాగా... స్టార్క్‌ (15), లయన్‌ (13) సాయంతో కీలక పరుగులు జోడించాడు.

స్కోరు వివరాలు 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: కోన్‌స్టాస్‌ (ఎల్బీ) (బి) జడేజా 60; ఖ్వాజా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 57; లబుషేన్‌ (సి) కోహ్లి (బి) సుందర్‌ 72; స్మిత్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 140; హెడ్‌ (బి) బుమ్రా 0; మార్ష్  (సి) పంత్‌ (బి) బుమ్రా 4; కేరీ (సి) పంత్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 31; కమిన్స్‌ (సి) నితీశ్‌ రెడ్డి (బి) జడేజా 49; స్టార్క్‌ (బి) జడేజా 15; లయన్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 13; బోలండ్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు: 27; మొత్తం (122.4 ఓవర్లలో ఆలౌట్‌) 474. వికెట్ల పతనం: 1–89, 2–154, 3–237, 4–240, 5–246, 6–299, 7–411, 8–455, 9–455, 10–474. బౌలింగ్‌: బుమ్రా  28.4–9–99–4; సిరాజ్‌ 23–3–122–0; ఆకాశ్‌దీప్‌ 26–8–94–2; జడేజా 23–4–78–3; నితీశ్‌ రెడ్డి 7–0–21–0; సుందర్‌ 15–2–49–1. 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (రనౌట్‌) 82; రోహిత్‌ (సి) బోలండ్‌ (సి) కమిన్స్‌ 3; రాహుల్‌ (బి) కమిన్స్‌ 24; కోహ్లి (సి) కేరీ (బి) బోలండ్‌ 36; ఆకాశ్‌దీప్‌ (సి) లయన్‌ (బి) బోలండ్‌ 0; పంత్‌ (బ్యాటింగ్‌) 6; జడేజా (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (46 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–8, 2–51, 3–153, 4–154, 5–159. బౌలింగ్‌: స్టార్క్‌ 13–0–48–0; కమిన్స్‌ 13–2–57–2; బోలండ్‌ 12–3–24–2; లయన్‌ 5–1–18–0; మార్ష్ 3–0–15–0. 

కోహ్లిని గేలి చేసిన ఆసీస్‌ అభిమానులు 
తొలి రోజు ఆటలో ఆ్రస్టేలియా ఓపెనర్‌ కోన్‌స్టాస్‌ను ఢీకొట్టి జరిమానాకు గురైన కోహ్లికి రెండో రోజు మైదానంలో చేదు అనుభవం ఎదురైంది. విరాట్‌ ఆడుతున్నంత సేపు గోల చేసిన అభిమానులు... అతడు అవుటై మైదానాన్ని వీడుతున్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తున్న కోహ్లి తిరిగివచ్చి ఆసీస్‌ అభిమానుల వైపు ఆగ్రహంగా చూడగా... భద్రతా అధికారి అతడికి నచ్చజెప్పి తీసుకెళ్లాడు.  

కోహ్లి భుజం మీద చేయి వేసి... 
శుక్రవారం ఆటలో ఓ అభిమాని సెక్యూరిటీ వలయం దాటుకొని మైదానంలోకి దూసుకురావడం కలకలం రేపింది. తొలి సెషన్‌లో టీమిండియా ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో గ్రౌండ్‌లోకి వచ్చిన ఆ వ్యక్తి కోహ్లి భుజంపై చేయి వేయడం గమనార్హం. ఇది గుర్తించిన సిబ్బంది అతడిని బలవంతంగా మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.

11 భారత్‌పై అత్యధిక (11) సెంచరీలు చేసిన బ్యాటర్‌గా స్మిత్‌ రికార్డుల్లోకెక్కాడు.  ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ జో రూట్‌ (10) రెండో స్థానానికి పడిపోయాడు.

1 ‘బోర్డర్‌–గావస్కర్‌’ ట్రోఫీలో అత్యధిక (10) సెంచరీలు చేసిన బ్యాటర్‌గా స్మిత్‌ నిలిచాడు. విరాట్‌ కోహ్లి, సచిన్‌ టెండూల్కర్‌ 9 శతకాలతో రెండో స్థానంలో ఉన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement