‘ఆఖరి’ అంచెకు భారత్‌ ‘సై’ | India to face Netherlands today in FIH Pro League Hockey | Sakshi
Sakshi News home page

‘ఆఖరి’ అంచెకు భారత్‌ ‘సై’

Jun 7 2025 12:58 AM | Updated on Jun 7 2025 6:58 AM

India to face Netherlands today in FIH Pro League Hockey

నేడు నెదర్లాండ్స్‌తో పోరు

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ హాకీ  

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

అమ్‌స్టెల్వీన్‌ (నెదర్లాండ్స్‌): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌ హాకీ ఆఖరి అంచె పోటీలకు భారత జట్లు సిద్ధమయ్యాయి. ఈ యూరో అంచె పోటీల్లో అంచనాలకు మించి రాణించాలని, గరిష్ట పాయింట్లతో నేరుగా ప్రపంచకప్‌ బెర్తు సాధించాలని పురుషుల, మహిళల జట్లు పట్టుదలతో ఉన్నాయి. ముందుగా భారత పురుషుల జట్టు నేడు ఆతిథ్య నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. భువనేశ్వర్‌ అంచె పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన భారత్‌ వచ్చే ప్రపంచకప్‌కు వేదికైన నెదర్లాండ్స్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. 

నేడు, 9వ తేదీన డచ్‌ టీమ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం ద్వారా యూరో అంచెకు శుభారంభం పలకాలని హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని భారత్‌ భావిస్తోంది. ప్రస్తుతం 15 పాయింట్లతో ఇంగ్లండ్‌ (16), బెల్జియం (16)ల తర్వాత మూడో స్థానంలో ఉన్న హర్మన్‌ బృందం ఈ ఆఖరి అంచె పోటీలతో మెరుగైన స్థానంలో నిలవాలని ఆశిస్తోంది. 

డ్రాగ్‌ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్, మిడ్‌ఫీల్డ్‌లో హార్దిక్‌ సింగ్‌లతో పాటు రక్షణ శ్రేణిలో అమిత్‌ రోహిదాస్, హర్మన్, జుగ్‌రాజ్, జర్మన్‌ప్రీత్‌లు స్థాయికి తగిన ఆటతీరును కనబరిస్తే గెలుపు ఏమంత కష్టం కాదు. భారత చీఫ్‌ కోచ్‌ క్రెయిగ్‌ ఫుల్టన్‌ తమ జట్టు అన్ని రంగాల్లోనూ మెరుగైందని, యువ ఆటగాళ్లు సైతం అనుభవం సంపాదించారని తప్పకుండా ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారని అన్నాడు. నెదర్లాండ్స్‌తో పోరు ముగిశాక భారత్‌ 11, 12 తేదీల్లో అర్జెంటీనాతో, 14, 15 తేదీల్లో ఆ్రస్టేలియాతో, 21, 22 తేదీల్లో బెల్జియంతో తలపడుతుంది. 

మరోవైపు మహిళల జట్టు యూరో అంచె పోటీలను లండన్‌లో ఆడనుంది. ఈ నెల 14 నుంచి భారత మహిళల జట్టు పోరు ప్రారంభం అవుతుంది. భారత జట్టు తొమ్మిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండింటిలో మాత్రమే గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement