
వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం
4–2 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌పై గెలుపు
సుల్తాన్ జొహర్ కప్ హాకీ టోర్నమెంట్
జొహర్ (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్‌లో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. తొలి పోరులో బ్రిటన్‌ను చిత్తు చేసిన యువభారత్... రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 4–2 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున అర్ష్ దీప్ సింగ్ (2వ నిమిషంలో), పీబీ సునీల్ (15వ నిమిషంలో), అరిజిత్‌సింగ్ హుండల్ (26వ నిమిషంలో), రోషన్ కుజుర్ (47వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ తరఫున గస్ నెల్సన్ (41వ నిమిషంలో), ఎయిడెన్ మ్యాక్స్ (52వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు.
మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే ప్రత్యర్థి డిఫెన్స్ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ అర్‡్షదీప్ గోల్ సాధించడంతో యువ భారత జట్టు ఖాతా తెరిచింది. న్యూజిలాండ్ కీపర్ బంతిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా... రెండోసారి అవకాశం దక్కించుకున్న అర్‡్షదీప్ విజయవంతంగా బంతిని నెట్‌లోకి పంపాడు. తొలి క్వార్టర్ ఆఖర్లో వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సునీల్ సది్వనియోగం చేసుకోవడంతో భారత జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచింది.
రెండో క్వార్టర్‌లో అరైజీత్ సింగ్ హుండల్ గోల్‌తో భారత్ ఆధిక్యం మరింత పెరిగింది. ఎట్టకేలకు 41వ నిమిషంలో న్యూజిలాండ్ తొలి గోల్ నమోదు చేసుకుంది. ఇక చివరి క్వార్టర్‌లో మరో పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని రోషన్ కుజుర్ గోల్‌గా మలచగా... ఆఖర్లో న్యూజిలాండ్ మరో గోల్ చేసినా లాభం లేకపోయింది. టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత జట్టు... తదుపరి మ్యాచ్‌లో మంగళవారం దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది.