IND VS WI 4th T20: హిట్‌మ్యాన్‌ ఖాతాలో పలు రికార్డులు.. దిగ్గజాల సరసన చేరిక

IND VS WI 4th T20: Rohit Sharma Completes 16000 Runs In International Cricket - Sakshi

Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. నిన్న (ఆగస్ట్‌ 6) విండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో 33 పరుగులు చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 16000 పరుగుల క్లబ్‌లో చేరాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏడో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌కు ముందు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ (34,357), రాహుల్‌ ద్రవిడ్‌ (24,064), విరాట్‌ కోహ్లి (23,726), సౌరవ్‌ గంగూలీ (18,433), ఎంఎస్‌ ధోని (17,092), వీరేంద్ర సెహ్వాగ్‌ (16,892) 16000 పరుగుల మైలురాయిని అధిగమించారు.

వన్డేల్లో 9376 పరుగులు, టీ20ల్లో 3487, టెస్ట్‌ల్లో 3137 పరుగులు చేసిన రోహిత్‌ ఖాతాలో ప్రస్తుతం సరిగ్గా 16000 పరుగులు ఉన్నాయి. హిట్‌మ్యాన్‌ ఈ మార్కును చేరుకునే క్రమంలో మరో రికార్డును కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఓపెనర్‌గా 3000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ 3119 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన రోహిత్‌ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు (477) బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి  ఎగబాకాడు. ఈ క్రమంలో పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదిని (476 సిక్సర్లు) అధిగమించాడు. ఈ జాబితాలో విండీస్‌ విధ్వంసకర యోధుడు, యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌ మొత్తంలో 553 సిక్సర్లు బాదిన గేల్‌ పేరిట అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదై ఉంది.  ఇదిలా ఉంటే, నిన్న విండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్‌ విండీస్‌పై 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. 
చదవండి: Ind Vs WI: ఎనిమిదింటికి ఎనిమిది గెలిచేశాడు.. నువ్వు తోపు కెప్టెన్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top