కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు సైతం తీవ్ర నిరాశపరిచారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌటైంది. 37/1 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ అదనంగా 152 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు కేవలం 30 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ కేఎల్ రాహుల్(39) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్(29), రవీంద్ర జడేజా(27), రిషబ్ పంత్(27) కాసేపు క్రీజులో నిలబడ్డారు.
సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్‌ను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. హార్మర్ 4 వికెట్లతో గిల్ సేన పతనాన్ని శాసించాడు. అతడితో పాటు పేసర్ మార్కో జానెసన్ మూడు, మహారాజ్, బాష్ తలా వికెట్ సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 159 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
గిల్ రిటైర్డ్ ఔట్..
కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. హార్మర్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో గిల్ మెడ పట్టేసింది. దీంతో ఫిజియో సాయంతో గిల్ మైదానాన్ని వీడాడు.
ఆ తర్వాత అతడు తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో అతడిని రిటైర్డ్ ఔట్‌గా పరిగణించారు. అయితే గిల్ తమ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
చదవండి: IPL 2026: సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్


