కోహ్లి ఖాతాలో మరో ఘనత.. ఆ జాబితాలో నాలుగో స్థానానికి

IND Vs ENG 2nd Test: Kohli Overtakes Clive Lloyd To Become 4th Most Successful Captain In Test Cricket - Sakshi

లండన్: లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా సూపర్‌ విక్టరీ సాధించడంతో జట్టు సారధి కోహ్లి ఖాతాలో మరో ఘనత చేరింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్ల జాబితాలో కోహ్లి  నాలుగో స్థానానికి ఎగబాకాడు. కెప్టెన్‌గా కోహ్లీ 63 టెస్ట్‌ల్లో 37 విజయాలతో వెస్టిండీస్ మాజీ సారథి, దిగ్గజ ఆటగాడు క్లైవ్ లాయిడ్‌(36 టెస్ట్‌ విజయాలు)ను అధిగమించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్‌ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ 109 మ్యాచ్‌ల్లో 53 విజయాలు అందుకుని ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

ఇక స్మిత్‌ తరువాతి స్థానంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఉన్నాడు. పాంటింగ్ 77 మ్యాచ్‌ల్లో 48 విజయాలతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో స్టీవ్‌ వా(ఆస్ట్రేలియా) 57 మ్యాచ్‌ల్లో 41 విజయాలతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి.. స్టీవ్‌ వా(41) మూడో స్థానంపై కన్నేశాడు. మరోవైపు, లార్డ్స్ మైదానంలో టెస్ట్‌ మ్యాచ్ గెలిచిన మూడో భారత సారథిగా కూడా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు 1986లో కపిల్‌ దేవ్, 2014లో ధోని మాత్రమే ఈ మైదానంలో టెస్ట్‌ విజయాలను అందుకున్నారు.
చదవండి: 'మీరు ఒకరి వెంటపడితే.. మేం 11 మందిమి మీ వెంటపడతాం': కేఎల్‌ రాహుల్‌

లార్డ్స్ విజయంతో కోహ్లి..  సేన (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక విజయాలను అందుకున్న ఆసియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే, టెస్ట్‌ల్లో టాస్ ఓడిపోయిన తర్వాత మ్యాచ్ గెలవడం కోహ్లీకి ఇది ఆరోసారి. ఇంతకుముందు గంగూలీ ఐదు సార్లు, ధోని నాలుగుసార్లు ఈ ఫీట్ సాధించారు. ఇక భారత్‌ తరఫున అత్యధిక టెస్ట్‌ విజయాలు నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో కోహ్లి(37) శిఖరాగ్రానికి చేరాడు. కోహ్లి తరువాత ధోని 60 మ్యాచ్‌ల్లో 27 విజయాలతో రెండో స్థానంలో, 49 మ్యాచ్‌ల్లో 21 విజయాలతో గంగూలీ మూడో స్థానంలో ఉన్నారు. 

ఇదిలా ఉంటే, చివరి రోజు ఆటలో టీమిండియా టెయిలెండర్లు షమీ(70 బంతుల్లో 56 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు) అద్భుత పోరాట పటిమ కనబర్చడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 298 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. దాంతో ఇంగ్లండ్ గెలవాలంటే 60 ఓవర్లలో 272 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో భారత పేసు గుర్రాలు చెలరేగడంతో ఇంగ్లీష్‌ జట్టు కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి, 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకొట్టిన కేఎల్‌ రాహుల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 
చదవండి: ‘ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి’.. కోహ్లి మాటను నిజం చేసిన భారత పేసు గుర్రాలు
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top