కేఎల్‌ రాహుల్‌ అర్ధ శతకం.. పంత్‌ ధనాధన్‌ | IND vs ENG 2nd Test: Karun Out KL Rahul Falls After Well Made Fifty | Sakshi
Sakshi News home page

IND vs ENG: కేఎల్‌ రాహుల్‌ అర్ధ శతకం.. కానీ కాసేపటికే..

Jul 5 2025 5:02 PM | Updated on Jul 5 2025 6:20 PM

IND vs ENG 2nd Test: Karun Out KL Rahul Falls After Well Made Fifty

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) అర్ధ శతకంతో మెరిశాడు. సంప్రదాయ ఫార్మాట్‌లో తన 18వ ఫిఫ్టీ నమోదు చేశాడు. కాగా భారత్‌- ఇంగ్లండ్‌ (Ind vs Eng) మధ్య ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తొలి రెండు రోజుల్లో టీమిండియా ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌట్‌ అయిన టీమిండియా.. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ 77 పరుగుల వద్ద ఉండగా మూడు వికెట్లు కూల్చి సత్తా చాటింది.

ఇంగ్లండ్‌ 407 పరుగులకు ఆలౌట్‌
అయితే, శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో మాత్రం ఇంగ్లండ్‌ కుదురుకుంది. హ్యారీ బ్రూక్‌ (158), జేమీ స్మిత్‌ (184 నాటౌట్‌) అద్భుత శతకాలతో రాణించి 303 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. అయితే, ఆ తర్వాత మరోసారి భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌ 407 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఈ క్రమంలో 180 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియా శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి వికెట్‌ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ 28 పరుగుల వద్ద నిష్క్రమించగా.. కేఎల్‌ రాహుల్‌ 28, కరుణ్‌ నాయర్‌ 7 పరుగులతో క్రీజులో నిలిచారు.

కేఎల్‌ రాహుల్‌ అర్ధ శతకం
ఈ నేపథ్యంలో 64/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్‌.. కరుణ్‌ నాయర్‌ (26) రూపంలో రెండో వికెట్‌ కోల్పోయింది. బైడన్‌ కార్స్‌ బౌలింగ్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు వికెట్‌ కీపర్‌ జేమీ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

ఈ క్రమంలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి నిలకడగా ఆడిన కేఎల్‌ రాహుల్‌ 78 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, కాసేపటికే జోష్‌ టంగ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. టంగ్‌ అద్భుత డెలివరీతో మిడిల్‌ స్టంప్‌ ఎగరగొట్టగా.. ఆశ్చర్యపోవడం రాహుల్‌ వంతైంది. కాగా మొత్తంగా 84 బంతులట్లో 55 పరుగులు చేసి రాహుల్‌ నిష్క్రమించగా.. రిషభ్‌ పంత్‌ గిల్‌కు జతయ్యాడు. ముప్పై ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌తో కలిపి 315కు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది.

UPDATE: ఇక భోజన విరామ సమయానికి టీమిండియా 38 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ 35 బంతులలో 41, శుబ్‌మన్‌ గిల్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 357 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

చదవండి: IND vs ENG 2nd Test: నన్ను మూడో టెస్టులో ఆడిస్తారో?.. లేదో తెలియదు: టీమిండియా స్టార్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement