బంగ్లాపై విజయం.. రోహిత్‌కు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్న కేఎల్‌ రాహుల్‌ 

IND VS BAN 1st Test: KL Rahul Wins In All Formats For Team India Outside India - Sakshi

చట్టోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంతోని టీమిండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పుజారా (90, 102 నాటౌట్‌), శుభ్‌మన్‌ గిల్‌ (20, 110), శ్రేయస్‌ అయ్యర్‌ (86), రవిచంద్రన్‌ అశ్విన్‌ (58), కుల్దీప్‌ యాదవ్‌ (40, 5/40, 3/73), అక్షర్‌ పటేల్‌ (1/10, 4/77) రాణించడంతో రాహుల్‌ సేన బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. ఫలితంగా 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెం‍డో టెస్ట్‌ మ్యాచ్‌ డిసెంబర్‌ 22 నుంచి ప్రారంభంకానుంది.

ఇదిలా ఉంటే, బంగ్లాపై విజయం సాధించడంతో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గాయం కారణంగా రోహిత్‌ శర్మ స్వదేశానికి తిరిగి వెళ్లడంతో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌.. విదేశాల్లో మూడో ఫార్మాట్లలో టీమిండియాను గెలిపించిన ఐదో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌, ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే మాత్రమే టీ20, వన్డే, టెస్ట్‌ల్లో విదేశీ గడ్డపై టీమిండియాను విజయపథంలో నడిపించారు. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కూడా ఇప్పటివరకు సాధ్యంకాని ఈ రికార్డును రాహుల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

జింబాబ్వే పర్యటనలో కెప్టెన్‌గా వన్డే సిరీస్ గెలిచిన రాహుల్, ఆసియా కప్ 2022లో ఆఫ్ఘాన్‌పై టీ20 విజయం సాధించాడు. తాజాగా బంగ్లాదేశ్‌పై తొలి టెస్ట్‌లో విజయం సాధించడంతో విదేశాల్లో మూడు ఫార్మాట్లలో టీమిండియాను గెలిపిం‍చిన దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ.. ఇప్పటివరకు విదేశాల్లో ఒక్క టెస్ట్‌ మ్యాచ్‌కు కూడా సారధ్యం వహించలేదు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సౌతాఫ్రికా టూర్‌లో, ఆతర్వాత ఇంగ్లండ్ టూర్‌లో ఐదో టెస్టు మ్యాచ్‌కు రోహిత్‌ గాయాల కారణంగా దూరంగా ఉన్నాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top