కోహ్లి కొట్టిన సెంచరీతో...

Ind VS Aus 4th Test: Virat Kohli 75th Century - Sakshi

అహ్మదాబాద్‌ టెస్టుపై పట్టు మనదే

భారత్‌ 571 ఆలౌట్‌

విరాట్‌ కోహ్లి భారీ శతకం

మెరిసిన అక్షర్‌ పటేల్‌ 

టీమిండియాకు 91 పరుగుల ఆధిక్యం

నేడు ఆసీస్‌ బ్యాటర్లకు పరీక్ష 

నాలుగో టెస్టులో నాలుగో రోజు నాలుగో శతకం నమోదైంది. ఒక టెస్టులో నాలుగు సెంచరీలు కొత్తేం కాదు... కానీ ఈ ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో మాత్రం ఇది గొప్ప విశేషం. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన మూడు టెస్టులు కూడా మూడో రోజుల్లోనే ముగిశాయి. స్పిన్నర్లు తిప్పేసిన ఆ మ్యాచ్‌ల్లో బ్యాటర్లు విలవిలలాడారు. గత మ్యాచుల్ని శాసించిన బౌలర్లపై ఇరు జట్ల బ్యాటర్లు   సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఫలితంగా నాలుగో టెస్ట్‌లో చివరి రోజు ఆట ఆసక్తికరం కానుంది.   

అహ్మదాబాద్‌: విరాట్‌ కోహ్లి (364 బంతుల్లో 186; 15 ఫోర్లు) భారీ శతకంతో చివరి టెస్టులో భారత్‌ పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 178.5 ఓవర్లలో 571 పరుగుల వద్ద ఆలౌటైంది. నాలుగో రోజు ఆటలో అక్షర్‌ పటేల్‌ (113 బంతుల్లో 79; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కోహ్లితో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 91 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

ఆఖరి రోజు సోమవారం ఉదయం ఆతిథ్య బౌలర్లు కూడా సమష్టిగా ఓ చేయి వేసి... ఆసీస్‌ను 200 పరుగుల్లోపు కట్టడి చేస్తే ఛేదించే లక్ష్యం మన ముందుంటుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్త్‌ వేటకు శుభం కార్డు పడుతుంది.  

1205 రోజుల తర్వాత... 
భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి... సుదీర్ఘ టెస్టు సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. ఆఖరి టెస్టులో మూడంకెల స్కోరు ముచ్చట తీర్చుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 289/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన భారత్‌కు జడేజా (84 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రూపంలో గట్టిదెబ్బే తగిలింది.

బ్యాటింగ్‌కు కలిసొచ్చే పిచ్‌పై కోహ్లికి జతయిన ఆంధ్ర క్రికెటర్‌ శ్రీకర్‌ భరత్‌ (44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) జతయ్యాడు. ‘రన్‌ మెషిన్‌’ అండతో భరత్‌ భారీ సిక్సర్లతో అలరించాడు. 363/4 వద్ద లంచ్‌కు వెళ్లొచ్చాక ఎంతో ఓపిగ్గా ఆడిన కోహ్లి 241 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

2019లో నవంబర్‌ 23న క్రికెట్‌ మక్కా ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌పై కోహ్లి 27వ టెస్ట్‌ శతకం సాధించాడు. మళ్లీ 43 టెస్టుల తర్వాత భారత గడ్డపైనే 28వ సెంచరీ చేసి 1205 రోజుల నిరీక్షణకు ముగింపు పలికాడు. ఐదో వికెట్‌కు 84 పరుగులు జోడించాక లయన్‌ బౌలింగ్‌లో భరత్‌... హ్యాండ్స్‌కాంబ్‌ చేతికి చిక్కాడు. అనంతరం అక్షర్‌ పటేల్‌ కూడా పట్టుదలతో ఆడటంతో ఆ్రస్టేలియాకు కంగారు తప్పలేదు. ఇద్దరి జోడీ కుదరడంతో భారత్‌ భారీస్కోరుకు బాటపడింది.

మూడో సెషన్‌లో టీమిండియా 500 మార్క్‌ను అందుకోగా, కోహ్లి 150 పరుగులు పూర్తయ్యాయి. కాసేపటికే అక్షర్‌ 95 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అక్షర్‌ను స్టార్క్‌ బౌల్డ్‌ చేయడంతో ఆరో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కాసేపటికే భారత్‌ ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆడిన ఆసీస్‌ ఆట నిలిచే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. కునెమన్‌ (0 బ్యాటింగ్‌), హెడ్‌ (3 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 

అయ్యర్‌ అవుట్‌! 
భారత  మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగలేదు. వెన్నునొప్పితో బాధపడిన అతనికి స్కానింగ్‌ కూడా తీశారు. ముందు జాగ్రత్తగా జట్టు మేనేజ్‌మెంట్‌ అతన్ని ఆడించలేదు. మూడో రోజు ఆటలోనే అతనికి నొప్పి మొదలైనట్లు తెలిసింది. గాయం తీవ్రత దృష్ట్యా అతను ఈ నెల 17 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. 

56 భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ జట్టు బౌలర్‌గా నాథన్‌ లయన్‌ గుర్తింపు పొందాడు. భారత్‌లో 11 టెస్టులు ఆడిన లయన్‌ 56 వికెట్లు పడగొట్టాడు. డెరిక్‌ అండర్‌వుడ్‌  (ఇంగ్లండ్‌; 16 టెస్టుల్లో 54 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును లయన్‌ బద్దలు కొట్టాడు.

10 తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కొట్టిన సిక్స్‌లు.  ఆ్రస్టేలియాపై ఓ టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో భారత్‌ కొట్టిన అత్యధిక సిక్స్‌లు ఇవే. 1986లో ముంబైలో, 2013లో చెన్నైలో ఆ్రస్టేలియాతో జరిగిన టెస్ట్‌ల్లో భారత్‌ ఎనిమిది చొప్పున సిక్స్‌లు కొట్టింది. 

3 ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి ఆరు వికెట్లకు 50 అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన మూడో జట్టుగా భారత్‌ నిలిచింది. గతంలో ఆ్రస్టేలియా (1960లో వెస్టిండీస్‌పై), పాకిస్తాన్‌ (2015లో బంగ్లాదేశ్‌పై) ఈ ఘనత సాధించాయి.   

స్కోరు వివరాలు 
ఆస్ట్రేలియా తొలిఇన్నింగ్స్‌: 480;
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) లబుõషేన్‌ (బి) కునెమన్‌ 35; గిల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్‌ 128; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) మర్ఫీ 42; కోహ్లి (సి) లబుõషేన్‌ (బి) మర్ఫీ 186; జడేజా (సి) ఖాజా (బి) మర్ఫీ 28; భరత్‌ (సి) హ్యాండ్స్‌కాంబ్‌ (బి) లయన్‌ 44; అక్షర్‌ (బి) స్టార్క్‌ 79; అశ్విన్‌ (సి) కునెమన్‌ (బి) లయన్‌ 7; ఉమేశ్‌ (రనౌట్‌) 0; షమీ (నాటౌట్‌) 0; అయ్యర్‌ (అబ్సెంట్‌ హర్ట్‌); ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (178.5 ఓవర్లలో ఆలౌట్‌) 571. వికెట్ల పతనం: 1–74, 2–187, 3–245, 4–309, 5–393, 6–555, 7–568, 8–569, 9–571. బౌలింగ్‌: స్టార్క్‌ 22–3–97–1, గ్రీన్‌ 18–1–90–0,  నాథన్‌ లయన్‌ 65–9– 151–3, కునెమన్‌ 25–3–94–1, మర్ఫీ 45.5– 10–113–3, హెడ్‌ 3–0–8–0.  

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: కునెమన్‌ (బ్యాటింగ్‌) 0; హెడ్‌ (బ్యాటింగ్‌) 3; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 3. 
బౌలింగ్‌: అశ్విన్‌ 3–2–1–0, రవీంద్ర జడేజా 2–1–1–0, షమీ 1–0–1–0.  

చదవండి: Virat Kohli- Steve Smith: విరాట్‌ కెరీర్‌లో ఇదే తొలిసారి! కోహ్లి బ్యాట్‌ చెక్‌ చేసిన స్మిత్‌.. వైరల్‌
WTC- Ind VS Aus 4th Test: టీమిండియాకు ఊహించని షాక్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top