అభిమానులతో కిక్కిరిసిన ఉప్పల్‌ స్టేడియం.. సామర్థ్యానికి మించి లోపలికి

IND vs AUS 3rd T20 Match: Over Capacity Crowd Came To Uppal Stadium - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఆదివారం అభిమానులతో కిక్కిరిసింది. భారత్‌– ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ–20 మ్యాచ్‌ చూసేందుకు అభిమానులు ఉప్పెనలా  తరలివచ్చారు. మూడేళ్ల తర్వాత ఇక్కడ మ్యాచ్‌ జరుగుతుండటంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మైదానానికి క్రికెటర్లు రాకముందే దాదాపుగా రెండు గంటల ముందు నుంచి వారిని చూసేందుకు అభిమానులు ఉప్పల్‌కు బారులుదీరారు.

వేలాదిగా తరలివచ్చిన అభిమానులు  భిన్న విభిన్న వేషధారణలతో ఉప్పల్‌కు తరలివచ్చారు.క్రికెటర్ల పేర్లతో ఉన్న టీ షర్టులను గ్రౌండ్‌ బయట విక్రయిస్తుండటంతో వాటిని కొనేందుకు యువత ఎగబడ్డారు. గ్రౌండ్‌లో నుంచి వచ్చే శబ్దాలతో బయట ఉన్న అభిమానులు సైతం ఎంజాయ్‌ చేశారు. 

వీఐపీ బాక్స్‌లోకి  ప్రజాప్రతినిధులు?  
ఉప్పల్‌  క్రికెట్‌ స్టేడియం టికెట్ల విషయంలో అంతా పారదర్శకమని చెబుతున్న హెచ్‌సీఏ అధికార పార్టీ నేతలను అందలమెక్కించుకుంది. ఎమ్మెల్యే స్థాయి నేతలతో కలిసి వచ్చిన, కార్పొరేటర్లు, కార్యకర్తలు, నేరుగా వీఐపీ బాక్స్‌లోకి ప్రవేశించి హంగామా సృష్టించారు. దీంతో టికెట్లు కొనుక్కున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు లోపలికి వెళ్లినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top