Ind Vs Aus: పాపం సూర్య! అందరూ తననే అంటున్నారు.. అతడి తప్పేం లేదు! నిజానికి..

Ind Vs Aus 2nd ODI: Dinesh Karthik Lauds Starc Feel For Suryakumar - Sakshi

India vs Australia, 2nd ODI- Suryakumar Yadav: ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌ అని చెప్పవచ్చు. ఇలాంటి అత్యుత్తమ పేసర్ల బౌలింగ్‌లో అవుటైన బ్యాటర్‌ను మరీ అంతగా విమర్శించడం సరికాదు’’ అని టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ అన్నాడు. అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ది వేరే లెవల్‌ అంటూ ఆకాశానికెత్తాడు.

టీమిండియాతో రెండో వన్డేలో ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 ఓవర్ల బౌలింగ్‌లో 53 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చాడు. రోహిత్‌ శర్మ(13), శుబ్‌మన్‌ గిల్‌(0), సూర్యకుమార్‌ యాదవ్‌(0), కేఎల్‌ రాహుల్‌(9) వంటి కీలక బ్యాటర్ల వికెట్లు తీశాడు. ఆఖర్లో సిరాజ్‌(0) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్‌ను గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

పాపం సూర్యకుమార్‌..
ఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మొదటి వన్డేలో కూడా స్టార్క్‌ చేతికే చిక్కిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో కూడా మరోసారి స్టార్క్‌ బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో అతడి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ దినేశ్‌ కార్తిక్‌ సూర్యకు అండగా నిలిచాడు. 

‘‘పాపం సూర్యకుమార్‌ యాదవ్‌.. రెండుసార్లు మొదటిబంతికే వెనుదిరిగాడు. దీంతో చాలా మంది.. ‘‘వచ్చిన అవకాశాలను సూర్య సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు’’ అని ఘాటుగా విమర్శిస్తున్నారు. నిజానికి తన తప్పేమీ లేదు. మొదటి బంతికే అవుటవడం అంటే క్రీజులో కుదురుకునే అవకాశం కూడా రాలేదని అర్థం. అలాంటపుడు ఏ బ్యాటర్‌కైనా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది.

వాళ్ల స్టైలే వేరు!
స్టార్క్‌ లాంటి అత్యుత్తమ బౌలర్లు తమ అద్భుత నైపుణ్యాలతో బ్యాటర్‌ను బోల్తా కొట్టించగలరు’’ అని డీకే క్రిక్‌బజ్‌ షోలో వ్యాఖ్యానించాడు. ఫాస్ట్‌ బౌలర్లలో స్టార్క్‌తో పాటు పాక్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది, కివీస్‌ స్టార్‌ ట్రెంట్‌బౌల్ట్‌ స్టైలే వేరని.. వారిని ఎదుర్కోవడం అంత సులువుకాదని పేర్కొన్నాడు. అలాంటి వారు పటిష్ట టీమిండియాతో ఆడే ఛాన్స్‌ వచ్చినపుడు మరింతగా రెచ్చిపోతారని దినేశ్‌ కార్తిక్‌ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరుగనుంది.

చదవండి:  IND vs AUS: మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం
Temba Bavuma: సెంచరీల మీద సెంచరీలు బాదుతూ జాత్యాహంకారుల నోళ్లు మూయించిన ధీరుడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top