రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి
వన్డే ప్రపంచకప్-2027 టోర్నీకి ముందు టీమిండియాకు కొన్ని మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడనున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలోనూ మూడు మ్యాచ్‌లు ఆడనుంది.
రో-కో ఆడతారా?
ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం టీమిండియా సొంతగడ్డపై వెస్టిండీస్‌తో మూడు.. అనంతరం న్యూజిలాండ్‌తో మూడు, శ్రీలంకతో మూడు వన్డేలు ఆడుతుంది. మొత్తానికి మెగా టోర్నీకి ముందు భారత్ దాదాపు పదిహేను వన్డేలు ఆడుతుంది. అయితే, దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వరల్డ్‌కప్‌లో ఆడతారా? లేదా? అన్న అంశంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.
అనుభవజ్ఞులైన రో-కో జట్టులో ఉంటేనే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వాళ్లిద్దరు మెగా టోర్నీకి అందుబాటులో ఉండే విషయమై తమకు ఇంత వరకు సమాచారం లేదన్నాడు. కానీ రో-కో మాత్రం తాము ఈ ఈవెంట్‌కు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.
గాయాల బెడద
దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడిన దిగ్గజ ద్వయం.. గత కొంతకాలంగా మంచి ఫామ్ కొనసాగించారు. అయితే, అఫ్గన్‌తో సిరీస్‌కు ముందు రోహిత్- కోహ్లి గాయపడటం మరోసారి చర్చకు తావిచ్చింది. 39 ఏళ్ల రోహిత్.. 38 ఏళ్ల కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నారు.
కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరం కానుండగా.. రోహిత్ అఫ్గన్‌తో ఆఖరి వన్డే నాటికి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్కుడిగా చెప్పుకొనే గ్రీన్‌స్టోన్ లోబో సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ జట్టులో ఉంటే టీమిండియా ఈసారి కూడా వన్డే వరల్డ్‌కప్ గెలవదని పేర్కొన్నాడు.
రోహిత్ జట్టులో ఉంటే జట్టు గెలవదు
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్ గెలిచే భారత జట్టులో రోహిత్ శర్మ భాగంగా ఉంటాడని నేను అనుకోవడం లేదు. చాలా మంది నన్ను ఇదే విషయం గురించి అడుగుతున్నారు. రోహిత్ అసలు జట్టులో ఉంటాడా? లేదా? అని వారు ఉత్సుకతతో ఉన్నారు.
సెలక్టర్లు కోరుకుంటే అతడు జట్టులో ఉంటాడు. అయితే, ఒక విషయం స్పష్టంగా చెప్పగలను. రోహిత్ శర్మ జట్టులో ఉంటే మాత్రం టీమిండియా ఈసారి వరల్డ్‌కప్ గెలవదు’’ అని గ్రీన్‌స్టోన్ లోబో పేర్కొన్నాడు.
సారథిగా ఇప్పటికే ఎన్నో విజయాలు
ఏదేమైనా ఇప్పటికే రోహిత్ శర్మ సారథిగా ఎన్నో విజయాలు సాధించాడన్న గ్రీన్‌స్టోన్ లోబో.. ముంబై ఇండియన్స్ కారణంగా అతడు వన్డే వరల్డ్‌కప్ గెలవలేకపోయాడని విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్‌గా రోహిత్ 2024లో టీ20 ప్రపంచకప్ సాధించాడు. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలోనూ అతడే సారథిగా ఉన్నాడు.
అయితే, దురదృష్టవశాత్తూ కప్ గెలవలేకపోయాడు. నిజానికి ఫ్రాంఛైజీ క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతడు ఐదు టైటిళ్లు గెలిచాడు. ఒకవేళ అలా జరుగకపోయి ఉంటే.. వన్డేలపై మరింత దృష్టి పెట్టి వరల్డ్‌కప్ కొట్టేవాడు. ముంబై ఇండియన్స్ వల్ల టీమిండియా నష్టపోయింది’’ అని గ్రీన్‌స్టోన్ లోబో వ్యాఖ్యానించాడు.
అభిమానుల ఆగ్రహం
ఈ నేపథ్యంలో జ్యోతిష్కుడి వ్యాఖ్యలపై రోహిత్ శర్మ అభిమానులు భగ్గుమంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు లాజిక్ లేకుండా మాట్లాడటం సరికాదని.. అసలు దిగ్గజ ఆటగాడి గురించి మాట్లాడే అర్హతే నీకు లేదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. కాగా రోహిత్ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే ఫార్మాట్)ని సొంతం చేసుకుంది.
చదవండి: కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ


