World Cup 2022: అదరగొట్టిన మిథాలీ సేన.. బంగ్లాపై భారీ విజయంతో..

ICC Women World Cup 2022: India Beat Bangladesh By 110 Runs - Sakshi

ICC Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు అదరగొట్టింది. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. హామిల్టన్‌ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42)కు తోడు యస్తికా భాటియా అర్ధ శతకంతో రాణించడంతో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. అయితే, గత మ్యాచ్‌లో అద్భుత హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(0) మరోసారి నిరాశపరిచింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 

షర్మీన్‌ అక్తర్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లా.. 15 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో భారత బౌలర్లు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. దీంతో 40.3 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్‌ అయింది. తద్వారా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేన 110 పరుగులతో సునాయాస విజయం సాధించి సెమీస్‌ మార్గాలను సుగమం చేసుకుంది.

ఇక బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా అక్తర్‌ 2, జహనారా ఆలం ఒక వికెట్‌ పడగొట్టారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా అత్యధికంగా 4 వికెట్లు తీసి సత్తా చాటింది. ఝులన్‌ గోస్వామికి రెండు, రాజేశ్వరీ గైక్వాడ్‌కు ఒకటి, పూజా వస్త్రాకర్‌కు రెండు, పూనమ్‌ యాదవ్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ఇక అర్ధ శతకంలో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన యస్తికా భాటియాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ స్కోర్లు:
భారత మహిళా జట్టు:  229/7 (50)
బంగ్లాదేశ్‌ మహిళా జట్టు: 119 (40.3)

చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయం'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top