ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా బాబర్‌ ఆజం.. టీమిండియా నుంచి ఇద్దరే

ICC ODI Team of The Year: Only 2 Indians Find Spot Babar Azam Captain - Sakshi

ICC ODI Team of The Year: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి 2022 సంవత్సరానికి గానూ పురుషుల ఉ‍త్తమ వన్డే జట్టును మంగళవారం ప్రకటించింది. ఇందులో భారత్‌ నుంచి ఇద్దరు క్రికెటర్లకు మాత్రమే చోటు దక్కింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌, స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఐసీసీ వన్డే టీమ్‌లో స్థానం దక్కించుకున్నారు.

ఇక ఈ జట్టుకు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం సారథిగా ఎంపికయ్యాడు. అయితే, గతేడాది వన్డేల్లో పెద్దగా రాణించని టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లికి ఈ జట్టులో చోటు దక్కలేదు. కాగా క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. 

సారథిగా బాబర్‌
గతేడాది.. బాబర్‌ ఆజం 11 వన్డేల్లో.. ఎనిమిదింట ఫిఫ్టీకి పైగా స్కోర్లు నమోదు చేశాడు. ఇందులో మూడింటిని సెంచరీలుగా మలిచాడు. మొత్తంగా 679 పరుగులు సాధించాడు ఈ 28 ఏళ్ల బ్యాటర్‌.

అదరగొట్టిన అయ్యర్‌ 
50 ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 2022లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చాలా సందర్భాల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్‌.. ఆడిన 17 మ్యాచ్‌లలో 724 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి. 

సూపర్‌ సిరాజ్‌
పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ ఆకట్టుకుంటున్న టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌.. 2022లో ఉత్తమంగా రాణించాడు. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా జట్టులో లేని లోటు తీర్చే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. ఆడిన 15 మ్యాచ్‌లలో మొత్తంగా 4.62 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అతడు నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు 3/29.

11 మంది వీళ్లే
ఓపెనర్లుగా బాబర్‌ ఆజం, ట్రవిస్‌ హెడ్‌.. వన్‌డౌన్‌లో షాయీ హోప్‌, నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌, ఐదో స్థానంలో టామ్‌ లాథమ్‌.. ఆ తర్వాతి స్థానాల్లో ఆల్‌రౌండర్ల జాబితాలో సికిందర్‌ రజా(ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్‌), మెహిదీ హసన్‌ మిరాజ్‌(రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్‌).. పేసర్ల విభాగంలో అల్జారీ జోసెఫ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌.. స్పిన్‌ విభాగంలో ఆడం జాంపాలను ఐసీసీ ఎంపిక చేసింది. 

ఐసీసీ 2022 మెన్స్‌ వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌
1.బాబర్‌ ఆజం(కెప్టెన్‌)- పాకిస్తాన్‌
2. ట్రవిస్‌ హెడ్‌- ఆస్ట్రేలియా
3. షాయీ హోప్‌- వెస్టిండీస్‌
4. శ్రేయస్‌ అయ్యర్‌- ఇండియా
5. టామ్‌ లాథమ్‌(వికెట్‌ కీపర్‌)- న్యూజిలాండ్‌
6. సికిందర్‌ రజా- జింబాబ్వే
7. మెహిదీ హసన్‌ మిరాజ్‌- బంగ్లాదేశ్‌
8. అల్జారీ జోసెఫ్‌- వెస్టిండీస్‌
9. మహ్మద్‌ సిరాజ్‌- ఇండియా
10. ట్రెంట్‌ బౌల్ట్‌- న్యూజిలాండ్‌
11. ఆడం జంపా- ఆస్ట్రేలియా

చదవండి: ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టు.. భారత్‌ నుంచి ముగ్గురికి అవకాశం
Mohammed Shami: షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు కీలక ఆదేశాలు

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top