
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 11 నుంచి 15 వరకు జరగనున్న తుది పోరులో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రైజ్ మనీని అంతర్జాతీయ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. గత రెండు ఎడిషన్‌లతో పోలిస్తే.. ప్రైజ్ మనీనీ ఈసారి రెండింతలు ఐసీసీ పెంచింది.
ఈ మెగా మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 3.6 మిలియన్ల డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ. 31 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కనున్నది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 2.1 మిలియన్ల డాలర్ల ( సుమారు రూ. 18 కోట్లు) నగదు బహుమతి లభించనుంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23 ఫైనల్లో భారత జట్టుపై గెలిచిన ఆస్ట్రేలియాకు 1.6 మిలియన్ల డాలర్ల (రూ. 13.68 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది.
అలాగే రన్నరప్ టీమిండియాకు 8 లక్షల డాలర్లు (రూ. 6.84 కోట్లు) ఇచ్చారు. అయితే టెస్టు క్రికెట్‌కు ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు ప్రైజ్‌మనీని డబుల్ చేసినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో భాగమైన ఇతర జట్లకు కూడా నగదు బహుమతి లభించనుంది. పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్న భారత్‌కు 1.44 మిలియన్ డాలర్లు(సుమారు రూ.12 కోట్లు), నాల్గవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 1.2 మిలియన్ డాలర్లు ప్రైజ్‌మనీ అందనుంది.
ఇక డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో దక్షిణాఫ్రికా 69.44 శాతం పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాత డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 67.54 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. 50.00 పాయింట్లతో ఇండియా మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమి పాలవ్వడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మ్యాట్ కునెమన్, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్. ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డగెట్
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో యన్సెన్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కార్బిన్ బాష్, కైల్ వెర్రెయిన్, డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, సెనురన్ ముత్తుసామీ, డేన్ పాటర్సన్
చదవండి: IPL 2025: హ్యాండ్ ఇచ్చిన జోస్ బట్లర్.. గుజరాత్ జట్టులోకి విధ్వంసకర వీరుడు?