గోవా: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)కు చెందిన పది ఫ్రాంచైజీల అండర్–21 జట్ల మధ్య జరిగిన గార్డియన్స్ ట్రోఫీలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. గోవా వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు 15–7, 11–15, 16–14, 15–8తో ఆతిథ్య గోవా జట్టుపై గెలుపొందింది. అద్వితీయ ప్రదర్శన కనబర్చిన బ్లాక్ హాక్స్ ప్లేయర్ సార్థక్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
టోర్నమెంట్ ఆసాంతం రాణించిన సార్థక్ ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’తో పాటు ‘బెస్ట్ అటాకర్’ అవార్డులు సైతం సొంతం చేసుకున్నాడు. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, గోవా జట్లతో కలిసి గ్రూప్ ‘ఎ’లో పోటీపడిన హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ చక్కటి ప్రదర్శనతో ముందంజ వేసింది. సెమీఫైనల్లో బ్లాక్ హాక్స్ 16–14, 15–9, 16–14తో అహ్మదాబాద్‌పై విజయం సాధించి తుది పోరుకు చేరింది. ఈ నెల 6న విజయవాడలో నిర్వహించిన ట్రయల్స్ ద్వారా ఈ జట్టును ఎంపిక చేయగా ... ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ఆటగాళ్లు ఉన్నారు.


