
యూపీ, జార్ఖండ్ కూడా
జాతీయ జూనియర్ మహిళల హాకీ
సాక్షి, కాకినాడ: జూనియర్ మహిళల జాతీయ హాకీ చాంపియన్‌షి ప్‌లో హరియాణా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా 4–1తో ఒడిశాపై ఘనవిజయం సాధించింది. హరియాణా జట్టులో కాజల్ (2వ ని.), సుప్రియా (27వ ని.), శశి ఖాస (36వ ని.), సాది (60వ ని.) తలా ఒక గోల్ చేశారు. ఒడిశా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను అమిషా ఎక్కా 47వ నిమిషంలో సాధించింది. ఛత్తీస్‌గఢ్ 2–1తో పెనాల్టీ షూటౌట్‌లో మధ్య ప్రదేశ్‌పై గెలిచింది.
నిర్ణీత సమయంలో ఛత్తీస్‌గఢ్ నుంచి యశోద (2వ ని.), మధ్యప్రదేశ్ తరఫున హుడా ఖాన్ (15వ ని.) గోల్ చేయడంతో 1–1తో డ్రా అయింది. మరో క్వార్టర్స్‌లో జార్ఖండ్ 3–1తో పంజాబ్‌ను ఓడించింది. పంజాబ్ జట్టులో పవన్‌ప్రీత్ కౌర్ (6వ ని.) గోల్ చేయగా, జార్ఖండ్ జట్టులో స్వీటి డంగ్‌డంగ్ (7వ ని), శాంతి కుమారి (22వ ని.), రోషిణి ఐంద్ (46వ ని.) తలా ఒక గోల్ చేశారు. ఆఖరి క్వార్టర్ ఫైనల్లో ఉత్తర ప్రదేశ్ 2–1తో మహారాష్ట్రపై నెగ్గింది. యూపీ తరఫున సల్లు పుఖ్రంబమ్ (36వ ని.), రష్మీ పటేల్ (55వ ని.) చెరో గోల్ చేయగా, మహారాష్ట్ర జట్టులో దీక్షా షిండే (45వ ని.) ఒక గోల్ సాధించింది.