
మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై మూడు వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. 331 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు.
ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ అలీసా హీలీ(142) అద్భుత శతకంతో మెరిసింది. భారత బౌలర్లలో శ్రీచరణి మూడు, దీప్తి శర్మ, అమన్ జ్యోత్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓపెనర్లు స్మృతి మంధాన(66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80) ప్రతికా రావల్(96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 75) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆసీస్ బౌలర్ సదర్లాండ్ 5 వికెట్లతో సత్తాచాటింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించింది. తొలుత బ్యాటింగ్‌లో అదనంగా కొన్ని పరుగులు సాధించి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది అని ఆమె చెప్పుకొచ్చింది.
"ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణించాము. కానీ ఆఖరిలో మా రిథమ్‌ను కోల్పోయాము. అదనంగా మరో 30–40 పరుగులు చేసింటే మేమే విజయం సాధించేవాళ్లం. చివరి 6–7 ఓవర్లలో వికెట్లు వరుసగా కోల్పోవడం వల్ల మేము అనుకున్న టార్గెట్‌ను సెట్ చేయలేకపోయాము.
ఓపెనర్లు మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికి మేము సరిగా ఉపయోగించుకోలేకపోయాం. గత మూడు మ్యాచ్‌ల్లో మేం మిడిల్ ఓవర్లలో సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. కానీ లోయరార్డర్ బాధ్యత తీసుకొని జట్టును గట్టెక్కించింది.
కానీ ఈ రోజు మాత్రం 40 ఓవర్ల వరకు మా బ్యాటింగ్ బాగుంది. చివరి ఓవర్లలో మేము మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాము. ఆటలో ఇలాంటివి సహజంగా జరగుతూనే ఉంటాయి. ప్రతి మ్యాచ్‌లో 100 శాతం రాణించడం సాధ్యం కాదు. కానీ తిరిగి ఎలా పుంజుకున్నామన్నది ముఖ్యం. తదుపరి రెండు మ్యాచ్‌లు మాకు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో మేము ఓటమిపాలైనప్పటికి మాకు చాలా సానుకూల ఆంశాలు ఉన్నాయి.
చరణి ప్రదర్శనపై మాట్లాడుతూ.. ఆమె నిజంగా అద్భుతం. జట్టుకి అవసరమైనప్పుడు ప్రతీసారి చరణి ముందుంటుంది. హీలీ లాంటి బ్యాటర్‌కి కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగింది. ఆమెపై మాకు చాలా నమ్మకం ఉంది. ఎటువంటి పరిస్థితులలోనైనా మాకు వికెట్ అందించగలదు. మా జట్టు కాంబనేషన్ గురించి ఎటువంటి చర్చ అవసరం లేదు. ఎందుకంటే ఈ కాంబినేషన్‌తోనే మేం విజయాలు సాధించాం. ఒకట్రెండు ఓటములతో ఈ కాంబినేషన్ సరి కాదని నేను అనుకోవడం లేదు. మా తదుపరి మ్యాచ్‌లపై దృష్టిపెడతాము అని హర్మన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొంది.