మహిళల ప్రీమియర్ లీగ్-2026లో యూపీ వారియర్జ్ తొలి విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో నిన్న (జనవరి 15) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. గత మ్యాచ్‌లో నిదానంగా ఆడుతుందని రిటైర్డ్ ఔట్‌గా వెనక్కు పలిపించిన హర్లీన్ డియోల్ ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో వారియర్జ్‌ను గెలిపించింది. 24 గంటల్లోనే హర్లీన్ నుంచి ఈ కమ్ బ్యాక్ చూసి అభిమానులు ఔరా అంటున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నాట్ సీవర్ బ్రంట్ (65) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అమన్‌జోత్ కౌర్ (38), నికోలా క్యారీ (32 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ ఎడిషన్‌లో అద్భుతంగా రాణిస్తున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (16) ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే ఔటైంది. వారియర్జ్ బౌలర్లలో శిఖా పాండే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభన తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఆది నుంచే నిలకడగా ఆడిన వారియర్జ్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలు చేరింది. ఒత్తిడిలో హర్లీన్ డియోల్ (39 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి వారియర్జ్‌ను గెలిపించింది. ఆమెకు మెగ్ లాన్నింగ్ (25), లిచ్‌ఫీల్డ్ (25), క్లో ట్రాయాన్ (27 నాటౌట్) సహకరించారు. ముంబై బౌలర్లలో నాట్ సీవర్ బ్రంట్ 2, అమేలియా కెర్ ఓ వికెట్ తీశారు.


