హార్దిక్‌ బదులు అతడిని ఎంపిక చేయాల్సింది: పాక్‌ మాజీ స్టార్‌ | Sakshi
Sakshi News home page

T20 WC: హార్దిక్‌ బదులు అతడిని సెలక్ట్‌ చేయాల్సింది: పాక్‌ దిగ్గజం

Published Sat, May 4 2024 10:53 AM

Hardik Pandya Shouldve Missed Out: Ex Pakistan Star On Rinku T20 WC Snub

టీ20 వరల్డ్‌కప్‌-2024 నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన జట్టుపై పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. యశస్వి జైస్వాల్‌ వంటి యంగ్‌ స్టార్లకు చోటివ్వడం సరైన నిర్ణయమని.. అయితే, రింకూ సింగ్‌కు మాత్రం అనాయ్యం జరిగిందని పేర్కొన్నాడు.

లోయర్‌ ఆర్డర్‌లో హిట్టింగ్‌ ఆడగల రింకూను పక్కన పెట్టడం సరికాదని టీమిండియా సెలక్టర్ల తీరును కనేరియా విమర్శించాడు. హార్దిక్‌ పాండ్యా బదులు రింకూను జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.

రింకూ సింగ్‌కు అనాయ్యం
కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా మొదలయ్యే ప్రపంచకప్‌నకు బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని ఈ టీమ్‌లో రింకూ సింగ్‌కు స్థానం దక్కలేదు. రిజర్వ్‌ ప్లేయర్‌గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.

వీళ్లంతా భేష్‌
ఈ నేపథ్యంలో డానిష్‌ కనేరియా మాట్లాడుతూ.. ‘‘నాణ్యమైన క్రికెటర్లను ఉత్పత్తి చేస్తుందనే పేరు భారత్‌కు ఉంది. ఇటీవలి కాలంలో దుమ్ములేపుతున్న యశస్వి జైస్వాల్‌, అంగ్‌క్రిష్‌ రఘువంశీ ఇందుకు చక్కని ఉదాహరణలు.

మయాంక్‌ యాదవ్‌ సైతం తన పేస్‌ నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక అభిషేక్‌ శర్మ పవర్‌ హిట్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పాండ్యాకు ఎందుకు చోటిచ్చారు?
రింకూ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో ఉండాల్సింది. నా అభిప్రాయం ప్రకారం.. ఐపీఎల్‌ ప్రదర్శనను గనుక పరిగణనలోకి తీసుకుంటే హార్దిక్‌ పాండ్యాను ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకుండా ఉండాల్సింది.

ఇప్పటికే జట్టులో శివం దూబే ఉన్నాడు. అందుకే పాండ్యా బదులు రింకూను ఎంపిక చేస్తే డౌన్‌ ఆర్డర్‌లో శక్తిమంతమైన కూర్పు కుదిరి ఉండేది’’ అని స్పోర్ట్స్‌ నౌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

కాగా ప్రపంచకప్‌ ఈవెంట్లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు డిప్యూటీగా హార్దిక్‌ పాండ్యాను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, డానిష్‌ కనేరియా మాత్రం వైస్‌ కెప్టెన్‌నే పక్కనపెట్టాల్సిందని చెప్పడం గమనార్హం.

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్‌ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.

చదవండి: అమెరికా వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో ఐదుగురు భార‌త సంత‌తి ఆట‌గాళ్లు..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement