VVS Laxman: డాక్టర్‌ కాబోయి క్రికెటర్‌! ఆసీస్‌ అంటే ఆకాశమే హద్దు.. ఆ హీరోచిత ఇన్నింగ్స్‌ చిరస్మరణీయం! ఈ విషయాలు తెలుసా

Happy Birthday VVS Laxman: You Know These Interesting Facts - Sakshi

Happy Birthday VVS Laxman: వీవీఎస్‌ లక్ష్మణ్‌.. క్రీడా ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు...  కుదురైన ఆట.. తనదైన శైలితో క్రికెట్‌ ప్రేమికుల ప్రశంసలు పొంది.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా ఎదిగిన వీవీఎస్‌ లక్ష్మణ్‌ పుట్టిన రోజు నేడు. 48వ వసంతంలో అడుగుపెడుతున్న ఈ సొగసరి బ్యాటర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు లక్ష్మణ్‌ బర్త్‌డే సందర్భంగా అతడి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!

వెరీ వెరీ స్పెషల్‌
వెరీ వెరీ స్పెషల్‌ బ్యాట్స్‌మన్‌గా పేరొందిన వీవీఎస్‌ లక్ష్మణ్‌.. పూర్తి పేరు వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్‌. 1974, నవంబరు 1న హైదరాబాద్‌లో జన్మించారు. ఆరడుగులకు పైగా ఎత్తుండే ఈ కుడిచేతి వాటం గల బ్యాటర్‌.. మిడిలార్డర్‌లో రాణించాడు.

దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన లక్ష్మణ్‌.. 1994లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అండర్‌-19 జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. 88 పరుగులు సాధించాడు. కాగా ఆసీస్‌ మేటి క్రికెటర్లుగా ఎదిగిన బ్రెట్‌ లీ కూడా ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేయడం విశేషం.

అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో 1996లో జరిగిన టెస్టు సిరీస్‌తో లక్ష్మణ్‌ అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం బాది సత్తా చాటాడు.

ఈడెన్‌ గార్డెన్స్‌లో హీరోచిత ఇన్నింగ్స్‌
కోల్‌కతాలో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా లక్ష్మణ్‌ ఆడిన ఇన్నింగ్స్‌ తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేసిన వీవీఎస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 452 బంతులు ఎదుర్కొని 44 ఫోర్ల సాయంతో 281 పరుగులు సాధించాడు. లక్ష్మణ్‌ హీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు రాహుల్‌ ద్రవిడ్‌ 180 పరుగులతో రాణించడంతో నాటి మ్యాచ్‌లో భారత్‌ 171 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. ఇదే జోష్‌లో ఆఖరిదైన మూడో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

ఆసీస్‌ అంటే పూనకాలే
తన 15 ఏళ్ల కెరీర్‌లో 134 టెస్టుల్లో 8781 పరుగులు సాధించాడు. 86 వన్డేలు ఆడి 2338 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో మొత్తంగా 17 సెంచరీలు, 56 అర్ధ శతకాలు సాధించాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌.  కాగా టెస్టు కెరీర్‌లోని 17 సెంచరీల్లో ఆరు ఆస్ట్రేలియాపైనే సాధించడం విశేషం.

ప్రతిష్టాత్మక అవార్డులు
క్రీడా రంగంలో సేవలకు గానూ లక్ష్మణ్‌ను భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కాగా 2001లో వీవీఎస్‌ అర్జున పురస్కారం కూడా అందుకున్నాడు. కాగా లక్ష్మణ్‌ ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ హెడ్‌గా ఉన్నాడు. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గైర్హాజరీలో టీమిండియా కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే
వీవీఎస్‌ లక్ష్మణ్‌ తల్లిదండ్రులు డాక్టర్‌ శాంతారాం- డాక్టర్‌ సత్యభామ. లక్ష్మణ్‌ కుటుంబానికి భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో బంధుత్వం ఉంది. కాగా తొలుత వైద్య రంగంలో అడుగుపెట్టాలనుకున్న లక్ష్మణ్‌.. మనసు మాట విని క్రికెట్‌నే తన కెరీర్‌గా ఎంచుకున్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

ఇక లక్ష్మణ్‌ భార్య పేరు రాఘవా శైలజ.2004లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు సంతానం. అమ్మాయి పేరు అచింత్య, అబ్బాయి పేరు సర్వజిత్‌.

చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌.. టీమిండియాలో మూడు మార్పులు!
IND v sNZ: భారత జట్టులో నో ఛాన్స్‌.. 'అంతా సాయిబాబా చూస్తున్నారు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top