కానిస్టేబుల్‌ కొడుకు నుంచి టీమిండియా క్రికెటర్‌ దాకా! సంజూ ఆస్తి ఎంతంటే! | Happy Birthday Sanju Samson Family Background Career Highlights Net Worth Cars | Sakshi
Sakshi News home page

HBD Sanju Samson: కానిస్టేబుల్‌ కొడుకు, అన్న కూడా క్రికెటరే! సంజూ ఆస్తి ఎంతో తెలుసా?

Published Sat, Nov 11 2023 12:34 PM | Last Updated on Sat, Nov 11 2023 1:22 PM

Happy Birthday Sanju Samson Family Background Career Highlights Net Worth Cars - Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ పుట్టినరోజు నేడు(నవంబరు 11). కేరళకు చెందిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శనివారం 29వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా సంజూ వ్యక్తిగత, క్రికెట్‌ కెరీర్‌కు సంబంధించిన విశేషాలు మీకోసం!

కానిస్టేబుల్‌ కుమారుడు
►కేరళలోని విలింజం అనే చిన్న పట్టణంలో 1994లో జన్మించాడు సంజూ. 
►సంజూ తల్లిదండ్రుల పేర్లు లిల్లీ విశ్వనాథ్‌, శాంసన్‌ విశ్వనాథ్‌.  
►సంజూ తండ్రి శాంసన్‌ ఢిల్లీలో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కూడా!

అన్న కూడా క్రికెటరే
►సంజూకు అన్నయ్య సాలీ శాంసన్‌ ఉన్నాడు.
►తన కొడుకులను క్రికెటర్లుగా చూడాలన్న శాంసన్‌ ఆశయాన్ని నెరవేర్చేందుకు సంజూ ముందడుగు వేశాడు.
►తన అన్నయ్య సాలీ జూనియర్‌ క్రికెట్‌లో కేరళ వరకే పరిమితం కాగా.. సంజూ టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.

ఆ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా
ఢిల్లీలోని రోసరీ సీనియర్‌ సెకండరీ స్కూళ్లో చదుకున్న సంజూ.. తిరువనంతపురంలో డిగ్రీ చేశాడు. మార్‌ ఇవనోయిస్‌కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్‌గా పట్టా పుచ్చుకున్నాడు. ఇక సంజూ అన్నయ్య సైతం గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం అతడు ఏజీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు.

క్రికెట్‌ కెరీర్‌ సాగిందిలా..
దేశవాళీ క్రికెట్‌లో సొంత రాష్ట్రం కేరళకు ప్రాతినిథ్యం వహించిన సంజూ వికెట్‌ కీపర్‌గా, బ్యాటర్‌గా రాణించాడు. టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలోనూ తన ఆటతో దూసుకుపోయాడు.

ఈ క్రమంలో 2015లో టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. అలా జింబాబ్వేతో టీ20 మ్యాచ్‌ సందర్భంగా సంజూ శాంసన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

ఆరేళ్ల తర్వాత వన్డేల్లో
అయితే, వన్డేల్లో అరంగేట్రం కోసం సంజూ ఆరేళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ శ్రీలంకతో 2021 వన్డే సిరీస్‌ సందర్భంగా సంజూకు తుదిజట్టులో చోటు కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్‌. 

అయితే, సంజూకు ఇంతవరకు టెస్టుల్లో అడుగుపెట్టే అవకాశం మాత్రం రాలేదు. ఇటీవల వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి ఎంపికవుతానని ఆశించిన సంజూకు సెలక్టర్లు మొండిచేయే చూపారు.

అభిమానులతో పాటు దిగ్గజాల అండ
వన్డే, టీ20లలో పలు అవకాశాలు అందిపుచ్చుకున్న సంజూ నిలకడలేమి ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. వచ్చిన అవకాశాలను వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎ‍న్ని మ్యాచ్‌లు ఆడాడంటే
అయితే, టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ సహా మాజీ క్రికెటర్‌ రవి శాస్త్రి వంటి వాళ్లు సంజూకు అండగా నిలబడ్డారు. ప్రతిభావంతుడైన సంజూకు మరిన్ని అవకాశాలు కల్పించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.

టీమిండియా తరఫున ఇప్పటి వరకు 24 టీ20, 13 వన్డే మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్‌ ఆయా ఫార్మాట్లలో వరుసగా 390, 374 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 152 మ్యాచ్‌లలో 3888 రన్స్‌ చేశాడు.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా..
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా నేమ్‌, ఫేమ్‌ సంపాదించిన వాళ్లలో సంజూ కూడా ఒకడు. రూ. 8 లక్షలకు 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అతడిని కొనుగోలు చేయగా.. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున 2013లో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అరంగేట్రం చేశాడు.. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు.

ఈ క్రమంలో 2017లొ ఐపీఎల్‌లో తొలి సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ రాజస్తాన్‌ రాయల్స్‌ గూటికి చేరిన సంజూ శాంసన్‌ ఏకంగా కెప్టెన్‌ అయ్యాడు.

బ్యాటర్‌గా రాణిస్తూ కెప్టెన్‌గానూ ప్రతిభను నిరూపించుకున్న ఈ కేరళ ఆటగాడు ఐపీఎల్‌-2022లో రాయల్స్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. అయితే, తాజా సీజన్‌లో మాత్రం ప్లే ఆఫ్స్‌నకు చేర్చలేకపోయాడు.

నికర ఆస్తి విలువ ఎంతంటే?
ఐపీఎల్‌ ద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న క్రికెటర్లలో సంజూ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. రాయల్స్‌ కెప్టెన్‌గా ఏడాదికి రూ. 14 కోట్లు అందుకుంటున్నాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. ఇటీవలే బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న సంజూ శాంసన్‌ ప్రస్తుతం గ్రేడ్‌ ‘సి’లో ఉన్నాడు. తద్వారా ఏడాదికి కోటి రూపాయల మేర అతడికి దక్కుతుంది. 

లగ్జరీ కార్లు, ఇళ్లు
ఇక క్రికెటర్‌గా కొనసాగుతున్న సంజూ పలు బ్రాండ్లను ప్రమోట్‌ చేస్తున్నాడు. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న సంజూ శాంసన్‌ నికర ఆస్తి విలువ దాదాపు రూ. 75 ​కోట్లని అంచనా.

ఇక సంజూ గ్యారేజ్‌లో ఆడి ఏ6(ధర సుమారు రూ. 66 లక్షలు), బీఎండబ్ల్యూ 5 సిరీస్‌(సుమారు 65 లక్షలు), రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్స్‌ కార్‌(కోటి 64 లక్షలు), మెర్సిడెజ్‌ బెంజ్‌ సి క్లాస్‌(60 లక్షలు) వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

ఎక్కువగా రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే సంజూ శాంసన్‌కు కేరళలోని విలింజంలో సుమారు 4 కోట్ల విలువ చేసే ఇంటితో పాటు.. బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లలో కూడా కోట్ల విలువైన ఇళ్లు ఉన్నట్లు స్పోర్ట్స్‌కీడా నివేదిక తెలిపింది.

తన వంతు సాయం
సంజూ శాంసన్‌ అవసరమైన వాళ్లకు సాయం చేయడంలోనూ ముందే ఉంటాడు. 2018లో కేరళను వరదలు ముంచెత్తిన సమయంలో 15 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. అదే కాకుండా వివిధ చారిటీ కార్యక్రమాల్లోనూ భాగమయ్యాడు.

 చారుతో ప్రేమ వివాహం
స్నేహితురాలు చారులతను ప్రేమించిన సంజూ శాంసన్‌ 2018 డిసెంబరులో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చారు వృత్తిరిత్యా ఇంజనీర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement