మెద్వెదేవ్‌కు చుక్కెదురు | Good Start For Djokovic In French Open Tournament | Sakshi
Sakshi News home page

మెద్వెదేవ్‌కు చుక్కెదురు

Sep 30 2020 3:00 AM | Updated on Sep 30 2020 3:00 AM

Good Start For Djokovic In French Open Tournament - Sakshi

పారిస్‌: హార్డ్‌ కోర్టులపై అద్భుతంగా ఆడే రష్యా యువతార డానిల్‌ మెద్వెదేవ్‌ ఎర్రమట్టి కోర్టులపై మరోసారి తేలిపోయాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్‌ మెద్వెదేవ్‌ వరుసగా నాలుగో ఏడాదీ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 63వ ర్యాంకర్‌ మార్టన్‌ ఫుచోవిచ్‌ (హంగేరి) 6–4, 7–6 (7/3), 2–6, 6–1తో మెద్వెదేవ్‌ను బోల్తా కొట్టించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. 3 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫుచోవిచ్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు.

మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) అలవోక విజయంతో శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో జొకోవిచ్‌ 6–0, 6–2, 6–3తో మికెల్‌ వైమెర్‌ (స్వీడన్‌)ను ఓడించాడు. ఈ ఏడాది జొకోవిచ్‌కిది 32వ విజయం కావడం విశేషం. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 13వ సీడ్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా) 3 గంటల 17 నిమిషాల్లో 6–7 (5/7), 5–7 (4/7), 7–5, 6–4, 6–3తో స్యామ్‌ క్వెరీ (అమెరికా)పై అద్భుత విజయం సాధించాడు. తొలి రెండు సెట్‌లు కోల్పోయిన రుబ్లెవ్‌ ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లను సొంతం చేసుకొని నెగ్గడం విశేషం.  

ప్లిస్కోవా ముందంజ... 
మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) శ్రమించి రెండో రౌండ్‌లోకి చేరారు. ప్లిస్కోవా 2 గంటల 15 నిమిషాల్లో 6–7 (9/11), 6–2, 6–4తో మాయర్‌ షెరీఫ్‌ (ఈజిప్ట్‌)పై, సోఫియా గంటా 58 నిమిషాల్లో 6–4, 3–6, 6–3తో లుద్మిలా సమ్సోనోవా (రష్యా)పై నెగ్గారు. ఇద్దరు క్వాలిఫయర్లు ఇరీనా బారా (రొమేనియా) 6–3, 6–4తో 26వ సీడ్‌ డోనా వెకిచ్‌ (క్రొయేషియా)పై... 17 ఏళ్ల క్లారా టౌసన్‌ (డెన్మార్క్‌) 2 గంటల 45 నిమిషాల్లో 6–4, 3–6, 9–7తో 21వ సీడ్‌ జెన్నిఫర్‌ బ్రేడీ (అమెరికా)పై సంచలన విజయాలు సాధించారు.   

6 గంటల 5 నిమిషాల్లో... 
సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడుతోన్న ఇటలీ క్వాలిఫయర్‌ ఆటగాడు లొరెంజో గస్టినో అద్భుతం చేశాడు. 6 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మారథాన్‌ మ్యాచ్‌లో గస్టినో 0–6, 7–6 (9/7), 7–6 (7/3), 2–6, 18–16తో కొరెంటిన్‌ ముతె (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. తద్వారా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రెండో రౌండ్‌లోకి చేరాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్‌గా ఇది నిలిచింది. 2004 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అర్నాడ్‌ క్లెమెంట్, ఫాబ్రిస్‌ సాంతోరో మ్యాచ్‌ 6 గంటల 33 నిమిషాలు జరిగింది. ముతె, గస్టినో మధ్య జరిగిన మ్యాచ్‌లో 22 బ్రేక్‌ పాయింట్లు నమోదయ్యాయి. గస్టినో 96, ముతె 88  అనవసర తప్పిదాలు చేశారు. చివరి సెట్‌ ఒక్కటే 3 గంటల 29 నిమిషాలు సాగడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement