టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. మెగా ఈవెంట్ తర్వాత దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు తొలిసారిగా టీ20 సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది.
అత్యంత చేదు అనుభవం
వరల్డ్‌కప్‌లో జట్టును విజేతగా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌పై అనూహ్యంగా వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఈ టూర్ నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, శ్రేయస్‌కు సారథిగా తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం ఎదురైంది.
ఇంగ్లండ్ పర్యటనలోనూ
ఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఐరిష్ జట్టు చేతిలో ఓటమి చెందడం.. సిరీస్‌ను భారత్ చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇక ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే తరహా ఫలితం పునరావృతమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓటమి పాలైంది.
తీవ్ర స్థాయిలో విమర్శలు
ఈ క్రమంలో ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుదిజట్టు ఎంపికలో గంభీర్‌దే అంతిమ నిర్ణయం అని.. తరచూ మార్పులు చేస్తూ కెప్టెన్‌ను సైతం గందరగోళానికి గురిచేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడం గంభీర్‌కు ఇష్టం లేదని.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఒత్తిడితోనే అతడు ఇందుకు అంగీకరించాడనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్‌లు కోల్పోవడం సందేహాలకు తావిస్తోంది.
తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం వరుస ఓటములపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సేనతో పాటు.. గంభీర్ టీమ్‌పైనా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
వేటు పడుతుందా?
ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ANIతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా స్వదేశానికి తిరిగి రాగానే వరుస ఓటములపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. గంభీర్‌పై కూడా స్క్రుటినీ ఉంటుంది’’ అని తెలిపాయి.
కాగా గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందిలో ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్‌గా ర్యాన్ టెన్ డష్కాటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఉన్నారు.
ఇక తాజా సిరీస్‌లలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ విఫలం కావడంతో ఎవరిపైనైనా వేటు పడుతుందా? లేదంటే గంభీర్ చెప్పినట్లు సంధి దశ కాబట్టి పదవీకాలం పూర్తయ్యేంత వరకు వీరిని కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా గంభీర్ కాంట్రాక్టు 2027 వరకు ఉన్న సంగతి తెలిసిందే.
గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా డిజాస్టర్లు ఇవే
👉స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్
👉పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (ఆస్ట్రేలియాతో)ని చేజార్చుకున్న భారత్
👉పాతికేళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్
👉అరంగేట్రం నుంచి మూడు సీజన్లలో డబ్ల్యూటీసీ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి (2023-25)
👉సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు తొలిసారి వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్
👉ఐర్లాండ్‌కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన భారత్
👉ఇంగ్లండ్‌కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా
👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు అతిపెద్ద ఓటమి (ఇంగ్లండ్‌తో రెండో టీ20లో 125 పరుగుల తేడాతో చిత్తు) etc.


