ఫిపా ప్రపంచకప్ 2026లో ఫ్రాన్స్ సంచలనం కైలియన్ ఎంబాపె గోల్స్ వర్షం కురిపిస్తున్నాడు. 30 ఏళ్లు కూడా నిండని ఎంబాపె ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్, మూడు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో మెస్సీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు మరోసారి ఫైనల్లో తలపడితే ఎవరికి గోల్డెన్ బూట్ అందుతుందనేది ఆసక్తిగా మారింది.

ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లో మొరాకోను చిత్తు చేసిన ఫ్రాన్స్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక 27 ఏళ్ల ఎంబాపెకు ఫిఫా ప్రపంచకప్పుల్లో ఇది 20వ గోల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఎంబాపె ఒక అరుదైన ఫీట్ సాధించి ఫిఫా చరిత్రను తిరగరాశాడు. 30 ఏళ్ల లోపే ఫిఫాలో 20 గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా కైలియన్ ఎంబాపె రికార్డు సృష్టించాడు.

ఇక ఫిఫా ప్రపంచకప్పుల్లో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో ఎంబాపె రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ (21 గోల్స్) ఉన్నాడు. మెస్సీ రికార్డును అధిగమించేందుకు ఎంబాపె రెండు గోల్స్ దూరంలో నిలిచాడు. ఇక మొరాకోతో మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-0తో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

తొలి అర్ధభాగంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంలో విఫలమైన ఎంబాపె రెండో అర్ధభాగంలో మాత్రం 60వ నిమిషంలో గోల్‌తో మెరిశాడు. ఈ ఫిఫాలో ఎంబాపెకు ఇది 8వ గోల్ కావడం విశేషం. ఆ తర్వాత 66వ నిమిషంలో డెంబ్లీకి పాస్ అందించి అతడు రెండో గోల్ కొట్టడంలో సహాయపడ్డాడు. 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టు 2022లో రన్నరప్‌గా నిలిచింది. ఇక వరుసగా మూడోసారి సెమీస్ చేరిన ఫ్రాన్స్ టైటిల్ అందుకునేందుకు రెండు అడుగుల దూరంలో ఉంది.


