ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాగ్వేపై 1–0తో విజయం
పదోసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం
ఏకైక గోల్ కొట్టి ఫ్రాన్స్‌ను గెలిపించిన కెప్టెన్ ఎంబాపె
ఫిలడెల్ఫియా: మూడోసారి ప్రపంచ కప్ టైటిల్ సాధించాలని ఆశిస్తున్న ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు ఆ దిశగా మరో అడుగు వేసింది. పరాగ్వే జట్టుతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 1–0తో గెలిచి ఈ మెగా ఈవెంట్‌లో పదోసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ 70వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను కెప్టెన్ ఎంబాపె గోల్‌గా మలిచి ఫ్రాన్స్ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈనెల 10న జరిగే క్వార్టర్ ఫైనల్లో మొరాకో జట్టుతో ఫ్రాన్స్ తలపడుతుంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో మొరాకో జట్టును ఓడించే ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరింది. 1998, 2018 ప్రపంచకప్‌లలో టైటిల్ గెలిచిన ఫ్రాన్స్ 2022లో రన్నరప్‌గా నిలిచింది.
ప్రపంచకప్‌లో ఐదోసారి ప్రిక్వార్టర్ ఫైనల్ నాకౌట్ మ్యాచ్ ఆడిన పరాగ్వే జట్టు... ఫ్రాన్స్ జట్టును ఓడించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినా చివరకు ఓటమితో సరిపెట్టుకుంది. నాకౌట్ దశ తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగుసార్లు చాంపియన్, నాలుగుసార్లు రన్నరప్ జర్మనీ జట్టుపై ‘పెనాల్టీ షూటౌట్’లో సంచలన విజయం నమోదు చేసిన పరాగ్వే జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం అత్యంత మొరటుగా ఆడింది. ఫ్రాన్స్ జట్టు స్టార్ ప్లేయర్లు ఎంబాపె, డెంబెలె, డిజైర్ డుయి, అడ్రియన్ రబియోట్, మనూ కోన్‌లను ఎక్కడ పడితే అక్కడ నిలువరించేందుకు పరాగ్వే ఆటగాళ్లు ప్రయత్నించారు.
ఫ్రాన్స్ ఆటగాళ్లతో వాగ్వాదం చేయడం... జెర్సీలు పట్టి లాగడం... మోచేతులతో ఢీకొట్టడం... కాళ్లలో కాళ్లు పెట్టి అడ్డగించడం... చేశారు. పరాగ్వే ఆటగాళ్ల మొరటు ఆటతీరుపై రిఫరీ ఇల్గిజ్ తంతాòÙవ్ (ఉజ్బెకిస్తాన్) ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అందర్నీ నివ్వెరపరిచింది. మ్యాచ్ మొత్తంలో పరాగ్వే ఆటగాళ్లను కనీసం ఒక్కయెల్లో కార్డుతో కూడా రిఫరీ హెచ్చరించకపోగా.. ముగ్గురు ఫ్రాన్స్ ఆటగాళ్లకు ఆయన యెల్లో కార్డులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. తొలి అర్ధభాగంలో ఒక్కసారి కూడా పరాగ్వే గోల్‌పోస్ట్‌పై షాట్ కొట్టని ఫ్రాన్స్... రెండో అర్ధభాగంలో జోరు పెంచింది. వారి ప్రయత్నం 70వ నిమిషంలో ఫలించింది. ‘డి’ ఏరియాలో ఫ్రాన్స్ ఫార్వర్డ్ డిజైర్ డుయిని పరాగ్వే డిఫెండర్ గోమెజ్ కింద పడేశాడు.
వీడియో రీప్లే పరిశీలించాక రిఫరీ ఫ్రాన్స్ జట్టుకు పెనాల్టీ కిక్‌ను ప్రదానం చేశారు. ఎంబాపె దీనిని గోల్‌గా మలిచాడు. ఈ టోర్నీలో ఎంబాపె కిది ఏడో గోల్‌కాగా... ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో 19వ గోల్ కావడం విశేషం. ఖాతా తెరిచిన తర్వాత ఫ్రాన్స్ ఆటగాళ్లు రెండో గోల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే పరాగ్వే గోల్‌కీపర్ ఒర్లాండో గిల్ అడ్డుగోడలా నిలబడ్డాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎంబాపెతో కరచాలనం చేసేందుకు పరాగ్వే గోల్‌కీపర్ ఒర్లాండో వెళ్లగా ఫ్రాన్స్ కెప్టెన్ స్పందించలేదు. దాంతో ఒర్లాండో తన చేతిలో ఉన్న బంతిని ఎంబాపె వీపు పైకి విసిరేసి తన అసహనాన్ని ప్రదర్శించాడు.


