తొలి రోజే 16 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్‌ | Four wicket Robinson sparks New Zealand collapse in 1st Test after England slump | Sakshi
Sakshi News home page

ENG vs NZ: తొలి రోజే 16 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్‌

Jun 5 2026 7:57 AM | Updated on Jun 5 2026 9:05 AM

Four wicket Robinson sparks New Zealand collapse in 1st Test after England slump

ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ మధ్య గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో పేసర్లు పండగ చేసుకున్నారు. ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో తొలి రోజే 16 వికెట్లు నేలకూలాయి. ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న ఈ పోరులో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌటైంది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 39.4 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. హ్యారీ బ్రూక్‌ (71 బంతుల్లో 56; 10 ఫోర్లు) ఒక్కడే అర్ధశతకంతో పోరాడగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. బెన్‌ డకెట్‌ (19), ఎమిలియో (8), జాకబ్‌ బెథెల్‌ (6), జో రూట్‌ (1), జెమీ స్మిత్‌ (1), కెపె్టన్‌ బెన్‌ స్టోక్స్‌ (12) విఫలమయ్యారు. 

కివీస్‌ బౌలర్లలో కైల్‌ జెమీసన్‌ 5 వికెట్లు పడగొట్టగా... నాథన్‌ స్మిత్‌ 3, రూర్కె రెండు వికెట్లు పడగొట్టారు. మేఘావృతమైన వాతావరణంలో పిచ్‌ పేస్‌కు సహకరిస్తుండటంతో న్యూజిలాండ్‌ బౌలర్లు చెలరేగిపోయారు. వెలుతురు లేమి కారణంగా పలుమార్లు మ్యాచ్‌కు అంతరాయం సైతం వాటిల్లింది. 

కివీస్‌ బౌలర్లు చెడుగుడు ఆడుకున్న చోట ఇంగ్లండ్‌ బౌలర్లు మరింత రెచ్చిపోయారు. ఫలితంగా న్యూజిలాండ్‌ టాపార్డర్‌ పేకమేడను తలపించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 61 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (3), కాన్వే (1), డారిల్‌ మిచెల్‌ (12), టామ్‌ బ్లండెల్‌ (4) విఫలమవగా... కేన్‌ విలియమ్సన్‌ (0), రచిన్‌ రవీంద్ర (0) సున్నాలు చుట్టారు. ఇంగ్లండ్‌ పేసర్‌ ఓలీ రాబిన్‌సన్‌ తన తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లతో కివీస్‌ బ్యాటింగ్‌ వెన్ను విరిచాడు. ఫిలిప్స్‌ (34 బంతుల్లో 31 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), నాథన్‌ స్మిత్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చేతిలో 4 వికెట్లు ఉన్న కివీస్‌... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 79 పరుగులు వెనుకబడి ఉంది.
చదవండి: ఐపీఎల్‌పై దావూద్‌ కన్ను పడింది!

Advertisement
 
Advertisement
Advertisement