మెస్సీ మాయ చేసేనా! | Football World Cup in 6 days | Sakshi
Sakshi News home page

మెస్సీ మాయ చేసేనా!

Jun 5 2026 4:25 AM | Updated on Jun 5 2026 4:25 AM

Football World Cup in 6 days

మరో 6 రోజుల్లో ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌

అర్జెంటీనా జట్టుపై భారీ అంచనాలు 

టైటిల్‌ నిలబెట్టుకుంటే ఇటలీ, బ్రెజిల్‌ సరసన చోటు

చివరిసారి అమెరికా ఆతిథ్యమిచ్చిన 1994 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టోర్నీ అర్జెంటీనా జట్టుకు చేదు అనుభవాలే మిగిల్చింది. దిగ్గజ ప్లేయర్‌ డీగో మారడోనా డోపింగ్‌ పరీక్షలో విఫలం కావడంతో అతనిపై అనర్హత వేటు పడింది. లీగ్‌ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా 4–0తో గ్రీస్‌పై, 2–1తో నైజీరియాపై గెలిచింది. ఆ తర్వాత మారడోనా డోపింగ్‌లో దొరికిపోవడంతో నిర్వాహకులు అతనిపై వేటు వేశారు. 

మారడోనా లేకుండానే బల్గేరియాతో మూడో లీగ్‌ మ్యాచ్‌ ఆడిన అర్జెంటీనా 0–2తో ఓడిపోయింది. మూడో స్థానంలో నిలిచిన నాలుగు అత్యుత్తమ జట్లలో ఒకటిగా అర్జెంటీనా ముందంజ వేయగలిగింది. అయితే మారడోనా లేని అర్జెంటీనా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ను దాటలేకపోయింది. రొమేనియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2–3 గోల్స్‌ తేడాతో ఓడిపోయి నిష్క్రమించింది. ఈ ప్రపంచకప్‌ తర్వాత మారడోనా కెరీర్‌ కూడా ముగిసింది.  

32 ఏళ్ల అనంతరం మరోసారి ప్రపంచకప్‌ టోర్నీకి అమెరికా ఆతిథ్యమివ్వనుంది. ఈసారి అర్జెంటీనా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. అంతేకాకుండా మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టును టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకటిగా పరిగణిస్తున్నారు. 39 ఏళ్ల మెస్సీ ఈ ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పడం లాంఛనమే. 

తన చివరి ప్రపంచకప్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని మెస్సీ కూడా భావిస్తున్నాడు. సహచరులు కూడా మెస్సీకి ప్రపంచకప్‌ టైటిల్‌ను బహుమతిగా ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అర్జెంటీనా మరోసారి తమ అత్యుత్తమ ఆటతీరు కనబరిచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అమెరికాలోని మేజర్‌ లీగ్‌లో మెస్సీ ఇంటర్‌ మయామి జట్టు తరఫున ప్రొఫెషనల్‌ లీగ్‌ ఆడుతున్నాడు. కన్సాస్‌ సిటీలో ఏర్పాటు చేసిన మయామి జట్టు శిబిరంలో మెస్సీ సాధన చేస్తున్నాడు. 

అగ్రస్థానంతో... 
డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా క్వాలిఫయింగ్‌లో నిలకడగా రాణించి ప్రపంచకప్‌ బెర్త్‌ను దక్కించుకుంది. దక్షిణ అమెరికా జోన్‌ క్వాలిఫయింగ్‌లో అర్జెంటీనా 18 మ్యాచ్‌లు ఆడి 12 విజయాలు అందుకుంది. నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి 38 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. 

వరుసగా ఆరో ప్రపంచకప్‌ ఆడబోతున్న మెస్సీ ఈసారి కూడా అర్జెంటీనాను విజేతగా నిలబెడితే చరిత్ర పుటల్లో చోటు సంపాదిస్తాడు. వరుసగా రెండు ప్రపంచకప్‌లు అందించిన ఏకైక కెపె్టన్‌గా మెస్సీ గుర్తింపు పొందుతాడు. అంతేకాకుండా ఇటలీ (1934, 1938), బ్రెజిల్‌ (1958, 1962) తర్వాత వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన మూడో జట్టుగా అర్జెంటీనా నిలుస్తుంది.  

మరో నాలుగు గోల్స్‌ చేస్తే... 
2022 ప్రపంచకప్‌ గెలిచిన అర్జెంటీనా జట్టులోని 26 మంది ప్లేయర్లలో 17 మంది 2026 ప్రపంచకప్‌లోనూ ఆడుతున్నారు. ఇప్పటికే అత్యధిక ప్రపంచకప్‌ మ్యాచ్‌లు (26) ఆడిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పిన మెస్సీ మరో నాలుగు గోల్స్‌ చేస్తే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా మిరోస్లావ్‌ క్లోజ్‌ (జర్మనీ; 16 గోల్స్‌) పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలు కొడతాడు. – సాక్షి క్రీడా విభాగం

లీగ్‌ దశ తర్వాత పరీక్ష 
తాజా ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు లీగ్‌ దశలో అనుకూలమైన ‘డ్రా’ పడింది. అయితే నాకౌట్‌ దశ నుంచి అర్జెంటీనాకు ప్రతి మ్యాచ్‌ పరీక్షలా నిలువనుంది. గ్రూప్‌ ‘జె’లో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌ను జూన్‌ 16న అల్జీరియాతో, 22న రెండో మ్యాచ్‌ను ఆ్రస్టియాతో, 27న మూడో మ్యాచ్‌ను జోర్డాన్‌తో ఆడుతుంది. అర్జెంటీనా ఫామ్‌ దృష్ట్యా ఆ జట్టు మూడు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్‌ ‘టాపర్‌’గా నాకౌట్‌ దశకు చేరుకోవడం కష్టమేమీకాదు. 

ఇక నాకౌట్‌ దశలో గ్రూప్‌ ‘హెచ్‌’ రన్నరప్‌ జట్టుతో అర్జెంటీనా ఆడాల్సి ఉంది. గ్రూప్‌ ‘హెచ్‌’ నుంచి స్పెయిన్, ఉరుగ్వే జట్లు నాకౌట్‌ దశకు చేరుకోవచ్చు. అర్జెంటీనా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ ప్రత్యర్థిగా అమెరికా లేదా ఈజిప్ట్‌ ఉండవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే.. క్వార్టర్‌ ఫైనల్లో క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్‌ జట్టు అర్జెంటీనాకు ఎదురవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement