ఆ ఇంగ్లీష్‌ బౌలర్‌ పీక కోస్తానన్నాడు.. అందుకే అలా చేశా

Flintoff Warned That He Will Rip Off My Neck Says Yuvraj Singh - Sakshi

న్యూఢిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తన పీక కోస్తానని వార్నింగ్‌ ఇచ్చాడని సిక్సర్ల కింగ్‌ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాటి ఇంగ్లండ్ కెప్టెన్ ఫ్లింటాఫ్ తనను రెచ్చగొట్టడం వల్లే స్టువర్డ్ బ్రాడ్‌పై ఎదురుదాడికి దిగానని, ఈ క్రమంలోనే 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పానని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌ 17వ ఓవర్లో ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో తాను వరుసగా రెండు ఫోర్లు కొట్టానని, దీంతో అసహనానికి గురైన ఫ్లింటాఫ్ తనపై నోరుపారేసుకున్నాడని పేర్కొన్నాడు. రెండు చెత్త షాట్లు ఆడి సంబర పడొద్దని, తనను గేలి చేశాడని తెలిపాడు. దీనికి తాను కూడా అదే రితీలో స్పందించడంతో మాటామాటా పెరిగి కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్లిందని చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో ఫ్లింటాఫ్.. ‘నీ గొంతు కొస్తా' అని నన్ను హెచ్చరించగా, నేను కూడా బ్యాట్‌‌తో తలపై బాదుతానని బదులిచ్చానన్నాడు. అయితే ఫ్లింటాఫ్‌పై కోపానికి ఆ మరుసటి ఓవర్ బౌల్‌ చేసిన స్టువర్ట్ బ్రాడ్ బలయ్యాడని యువీ తెలిపాడు. బ్రాడ్‌ వేసిన ఆ ఓవర్‌లో అంతకుముందెన్నడూ ఆడని షాట్లను ఆడానని, యార్కర్‌ బంతులను సైతం స్టాండ్స్‌లోకి పంపానని అలనాటి మధుర క్షణాలను స్మరించుకున్నాడు. ఆఖరి బంతిని సిక్సర్ బాదాక ఫ్లింటాప్ వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వానని యువీ చెప్పుకొచ్చాడు. యువీ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రముఖ స్కోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ నాటి అద్భుత క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు.
చదవండి: కెప్టెన్సీ నాకే ఇస్తారనుకున్నా.. కానీ మధ్యలో అతనొచ్చాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top